కాటమరాయుడు

  • September 27, 2017 / 08:27 AM IST

మునుపటి సినిమా డిజాస్టర్, ప్రస్తుతం రీమేక్ చేస్తున్న సినిమా తమిళంలో యావరేజ్, తెలుగు వెర్షన్ సాంగ్స్ కి పెద్దగా స్పందన లభించలేదు. ట్రైలర్ తప్ప “కాటమరాయుడు” సినిమాకి సంబందించి ఇప్పటివరకూ వచ్చినవన్నీ దాదాపు మైనస్ లనే చెప్పాలి. కానీ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” అనే ఒక్క పేరు మాత్రమే ఈ చిత్రానికి సూపర్ ప్లస్. అందుకే నిన్నట్నుంచి థియేటర్ల ముందు జనాలు బారులు తీరారు. మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ “కాటమరాయుడు” క్యాష్ చేసుకొన్నాడా లేక మరోసారి అభిమానుల్ని నిరాశపరిచాడా? అనేది తెలియాలంటే మా సమీక్షను చదవాల్సిందే..!!

కథ : కాటమరాయుడు అలియాస్ రాయుడు (పవన్ కళ్యాణ్) ఊరు పెద్ద. తాను నమ్మిన పని కోసం ప్రాణాలు తియ్యడానికి, అవసరం అనుకుంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అంటూ కొండను సైతం ఢీకొనే సత్తా ఉన్నోడు. తల్లిదండ్రులు మరణించడంతో చిన్నప్పట్నుంచి తానే అన్నీ అయి తన నలుగురు తమ్ముళ్లను (శివ బాలాజీ, కమల్ కామరాజు, కృష్ణ చైతన్య, అజయ్) జాగ్రత్తగా పెంచుతాడు. కాకపోతే.. “ఆడోళ్ళు బాగా డేంజర్” అనే మెంటాలిటీతో పెరగడంతో పెళ్లి కాదు కదా కనీసం అమ్మాయిని పలకరించడానికి కూడా సిగ్గుపడుతుంటాడు రాయుడు.

అప్పటికే తమ ప్రియురాళ్లతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తమ్ముళ్ళు.. అన్నయ్యకు కూడా ఒకమ్మాయిని సెట్ చేసి.. ఆమె ప్రేమలో అన్నయ్యని పడేయకపోతే తమకు పెళ్లి అవ్వదని ఫిక్స్ అయ్యి.. అమ్మాయి కోసం అన్వేషణ ప్రారంభించగా వారికి పక్క ఊరు నుంచి కాలేజ్ పని మీద తమ ఊరు వచ్చిన క్లాసికల్ సింగర్ అవంతి (శ్రుతి హాసన్) కనిపిస్తుంది. ఈ అమ్మాయి అయితే అన్నయ్యకి సరైన జోడీ అని తమ్ముళ్ళు ఫిక్స్ అవ్వడం, వారిద్దరినీ కలపడానికి చేసే ప్రయత్నాలు, తీరా రాయుడు-అవంతి కలిసే టైమ్ కి రాయుడులోని రౌద్రాన్ని చూసి భయపడిన అవంతి అతడికి దూరంగా జరగడం వంటివి జరిగిపోతాయి. అసలు రాయుడ్ని చూసి భయపడే స్థాయిలో అవంతి ఏం చూస్తుంది? తమ్ముళ్ళ కోరిక ప్రకారం రాయుడు అవంతిని పెళ్ళాడగలిగాడా? లేదా? అనేది “కాటమరాయుడు” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు : ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ను చాలా వైవిధ్యమైన పాత్రల్లో చూసిన మురిసిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు “కాటమరాయుడు” ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి మాస్ గెటప్ లో, “రాయుడు”గా పంచెకట్టులో పవన్ కళ్యాణ్ రాజసానికి రాజముద్రలా ఉన్నాడు. ఇక తనదైన శైలిలో పలికించిన రౌద్రం, హాస్యం, శృంగారం వంటి రసాలతో ప్రేక్షకులు పులకరించిపోవడం ఖాయం.

శ్రుతి హాసన్ మునుపటి సినిమాల్లో కంటే మరింత అందంగా కనిపించింది. తమిళ వెర్షన్ కంటే అమ్మడి క్యారెక్టర్ కు స్కోప్ ఎక్కువ ఉండడం, పవన్ కళ్యాణ్ తో రోమాంటిక్ సీన్స్ వంటివి పవర్ స్టార్ అభిమానులను విశేషంగా అలరించే అంశాలు. చాలా కాలం తర్వాత రావు రమేష్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. ఇంకా ఓ నాలుగు విలన్లు ఉన్నప్పటికీ.. రావు రమేష్ నటుడిగా తన మార్క్ ను ప్రదర్శించగలిగాడు. ఆయన డైలాగ్ డెలివరీ సినిమాలో ఒన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. శివ బాలాజీ, అజయ్, కృష్ణ చైతన్య, కమల్ కామరాజులు తమ్ముళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడక్కడా కాస్త అతి అనిపించినా.. కామెడీతో మాత్రం నెట్టుకొచ్చేశారు. లాయర్ లింగ పాత్రలో అలీ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. కాకపోతే.. కాస్త డబుల్ మీనింగ్ ఎక్కువయ్యింది. అయితే.. మాస్ ఆడియన్స్ ఆ డబుల్ మీనింగ్ పెద్దగా కేర్ చేయరు కాబట్టి లింగ & కాటమరాయుడు బ్రదర్స్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ను విశేషంగా ఎంజాయ్ చేస్తారు.

సాంకేతికవర్గం పనితీరు : ఈ తరహా సినిమాలకి చాలా కీలకమైన ఆకట్టుకొనే బాణీలను సమకూర్చడంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఒక్క పాట కూడా కొత్తగా లేకపోవడం అటుంచి.. ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంటాయి. అయితే.. బీజీయమ్ తో బ్రతికిపోయాడు.

ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ “కాటమరాయుడు” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పల్లె అందాలను, అందాల భామల సొగసులను ఎంత హుందాగా చూపించాడో.. పవర్ స్టార్ ను అంతే పవర్ ఫుల్ గానూ ప్రెజంట్ చేశాడు. కొన్ని ఎలివేషన్ షాట్స్ అయితే.. “ఇది కదూ అభిమానులకు కావాల్సింది” అనే స్థాయిలో ఉన్నాయి. ట్రైన్ ఫైట్ సీన్ ను పిక్చరైజ్ చేసిన విధానం మాత్రం ప్రశంసనీయం. రామ్-లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన ఫైట్ సీన్స్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతాయి. ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ను చూసి విజిల్ వేయని అభిమాని ఉండడు. శరత్ మరార్ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని వేరే లెవల్ కి తీసుకెళ్ళాయి.

దర్శకుడు కిషోర్ ను “రీమేక్ స్పెషలిస్ట్” అని ఎందుకు అంటారో “కాటమరాయుడు” చూస్తే అర్ధమైపోతుంది. ఇప్పటికే సగానికిపైగా జనాలు చూసేసిన “వీరం” (తెలుగులో “వీరుడొక్కడే”) చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసిన విధానం, కొత్త సీన్స్, కామెడీ సీక్వెన్స్ లు డిజైన్ చేసిన తీరు అభినందనీయం. ఇక “జివ్వు జివ్వు..” పాటను పవన్ కళ్యాణ్ మార్క్ స్టెప్స్ తో పిక్చరైజ్ చేసిన విధానం అయితే.. థియేటర్ లో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం. అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకొంటున్నారో అదే స్థాయిలో చూపించి దర్శకుడిగా తన కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొన్నాడు డాలీ.

విశ్లేషణ : పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు ఓ వింధు భోజనం “కాటమరాయుడు” చిత్రం. ఒకట్రెండు సీన్లు తప్పితే.. ప్రతి ఫ్రేమ్ కు అభిమానులు పండగ చేసుకొంటారు. “ఇది కదరా మాకు కావాల్సిన ఎమోషన్” అంటూ ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే.. ఫార్ములా మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి విభిన్నమైన చిత్రాలను ఇష్టపడే వారిని మాత్రం “కాటమరాయుడు” పూర్తి స్థాయిలో రంజింపజేయలేడు.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus