అవంతరాలను దాటుకుని ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం కత్తిలాంటోడు సెట్స్ మీదకు వెళ్లింది. గురువారం నుంచి మొదటి షెడ్యూల్ మొదలైంది. సినిమాలో కీలకమైన జైల్ సన్నివేశాన్ని తొలి రోజు షూట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో తోట తరణి ప్రత్యేకంగా వేసిన జైలు సెట్ లో చిరు నటనకు పునః శ్రీకారం చుట్టారు. కొణెదల ప్రొడక్షన్, లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాకు ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్లు, చిరు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథలో స్వల్ప మార్పులు చేశారు. సాయి మాధవ్ బుర్రా కొన్ని ఎమోషనల్ సీన్లకు డైలాగులు రాశారని, ఆకుల శివ కామెడీ సన్ని వేశాలకు పెన్ సహకారం అందించినట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారు. దొంగగా, రైతుల కోసం పోరాడే వ్యక్తిగా మెగాస్టార్ కనిపించనున్నారు.
హీరో తో ఉంటూ వెన్నెల కిషోర్ నవ్వులు పూయించనున్నారు. సరైనోడు లో ఎంఎల్ ఏ గా ఆకట్టుకున్నకేథరిన్ ఓ పాటలో చిరుతో కలిసి డ్యాన్స్ వేయనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాస్ ప్రజలను ఉర్రూతలాడించే ట్యూన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా నిర్మాత రామ్ చరణ్ తేజ్ ప్లాన్ చేస్తున్నారు.