కవచం

  • December 7, 2018 / 12:26 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “కవచం”. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎప్పట్లానే భారీ బడ్జెట్ తో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ:
అన్యాయాన్ని, అక్రమాల్ని ఎదిరించి తన స్టేషన్ పరిధిలో తప్పు అనేది జరగకుండా చూసుకుంటూ.. తన ఇంటిపేరు ఎన్ కౌంటర్ గా మారాలని కలలుగంటుంటాడు విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్). కానీ.. ఆ కలలు నెరవేరకుండా అడ్డుపడుతుంటాడు స్టేషన్ సి.ఐ చింతకాయల ఆవేశం (పోసాని కృష్ణమురళి). ఈ క్రమంలో సంయుక్త (కాజల్ అగర్వాల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారేలోపే ఆమె విజయ్ కి దూరమవుతుంది. ఆ తర్వాత మరో సంయుక్త (మెహరీన్) విజయ్ జీవితంలోకి వస్తుంది. ఆమెకు సహాయం చేసే క్రమంలో పెద్ద కిడ్నాప్ డ్రామాలో ఇరుక్కుంటాడు విజయ్.

కట్ చేస్తే.. తాను ప్రేమించిన సంయుక్త (కాజల్) నిజంగానే కిడ్నాప్ చేయబడిందని, రెండో సంయుక్త (మెహరీన్) తనను వాడుకొందని తన పోలీస్ బుర్రకి అర్ధమవుతుంది. ఆ తర్వాత అదే బుర్రతో ఆలోచించి విజయ్ ఈ కిడ్నాప్ డ్రామా నుంచి ఎలా బయటపడ్డాడు? ఇంతకీ అసలు విజయ్ ని ఈ కిడ్నాప్ కేస్ లో ఇరికించాలని ప్రయత్నించింది ఎవరు? అనేది “కవచం” కథాంశం.
నటీనటుల పనితీరు:

బెల్లంకొండ శ్రీనివాస్ తన లుక్స్ మరియు కాస్ట్యూమ్స్ విషయంలో పెట్టే శ్రద్ద సగంలో సగమైనా డైలాగ్ డెలివరీ మీద పెడితే బాగుంటుందనిపిస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా బెల్లంకొండ బాబు ముఖంలో ఇంటెన్సిటీ కాదు కదా కనీసం దాని ఛాయలు కూడా కనిపించలేదు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో మాత్రం అలరించాడనుకోండి. ఎలాగూ వరుసబెట్టి సినిమాలు చేస్తాడు కాబట్టి.. ఇకనైనా హావభావాల విషయంలో కాస్త ట్రయినింగ్ తీసుకోవడమో లేక ప్రాక్టీస్ చేయడం లాంటివి చేస్తే బెటర్.
కాజల్ అగర్వాల్ అందంగా కనిపించింది. మెహరీన్ అందంగా కనిపించడానికి తాపత్రయపడింది. బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ నెగిటివ్ రోల్ ను పెద్దగా ప్రాముఖ్యత లేదు. హరీష్ ఉత్తమన్ పోషించిన పోలీస్ క్యారెక్టర్ కి డెప్త్ లేదు. పోసాని కృష్ణమురళి కామెడీ కొన్ని సన్నివేశాల్లో నవ్వించింది.సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు తమన్ కు “ఏదైనా చేయండి కానీ.. కొత్త ట్యూన్స్ ఇవ్వండి” అని అడిగినట్లున్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ మొత్తం ఎలక్ట్రానిక్ బీట్స్, సాంగ్స్ కోసం ఆకట్టుకోలేని బాణీలతో అయ్యిందనిపించాడు.
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం సినిమాకి పెద్ద ఎస్సెట్. మన చాలా సినిమాల్లో చూసేసిన లొకేషన్స్ ను కూడా తనదైన ఫ్రేమింగ్స్ తో చాలా కొత్తగా చూపించాడు ఛోటా. నిర్మాతల ఖర్చు మొత్తం సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో నిర్మాణ విలువలకి సినిమా ప్రొడక్షన్ గురించి అవగాహన ఉన్నవారెవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే.

దర్శకుడు శ్రీనివాస్ నవలలు ఎక్కువగా చదివాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎంచుకున్న కథ కానీ, ఆ కథలోని ట్విస్టులు కానీ సినిమాటిక్ గా అస్సలు అనిపించవు. పైగా.. క్యారెక్టర్స్ & క్యారెక్టరైజేషన్స్ లో ఎక్కడా సహజత్వం కనిపించదు. ఈ మైనస్ లు సరిపోవన్నట్లు.. సినిమాలో టైమ్ ఫ్రేమ్ విషయంలో క్లారిటీ ఉండదు. చాలా లాజికల్ గా తీయాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లెక్కకు మించిన లాజిక్స్ మిస్ అవుతాయి.
విశ్లేషణ:  
   
అద్బుతమైన విజువల్స్ ఉన్నాయి, ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు ఉన్నారు, భారీ బడ్జెట్ ఉంది. ఇన్ని ఉన్నా.. ఆకట్టుకొనే కథ-కథనం, అలరించే కథానాయకుడు మిస్ అయిన “కవచం” చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టమే.
రేటింగ్: 1.5/5 
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus