నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అన్నపూర్ణ స్టూడియోలో సి.ఎం కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా… ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బిబో శ్రీనివాసరావు సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ క్లాప్ ఇవ్వగా..మెగాస్టార్ చిరంజీవి స్విఛాన్ చేసారు. విక్టరీ వెంకటేష్ కెమెరా ఆపరేట్ చేయగా దర్శకరత్న దాసరి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సి.ఎం కె.సి.ఆర్ మాట్లాడుతూ…బాలకృష్ణ వందవ చిత్రానికి గౌతమిపుత్ర శాతకర్ణి కథాంశం ఎంచుకోవడం అనేది గొప్ప నిర్ణయం. ఈ సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక శాకానికి నాంది పలికిన తెలుగు చక్రవర్తి కథ ఇది. తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకునే కథతో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. వయసులో నేను కొంచెం పెద్దవాడిని కాబట్టి బాలకృష్ణకు నా ఆశీస్సులు దీవెనెలు అందిస్తున్నాను. బాలకృష్ణ 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి 200 రోజులు ఆడుతుంది. తెలుగు ప్రజలందరూ ఈ సినిమా చూసి మన చరిత్రను తెలుసుకోవాలి. తెలుగు ప్రజలను మద్రాసి అని పిలిచే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉందని తెలియచెప్పి తెలుగు వారికి గౌరవం తీసుకువచ్చారు ఎన్టీఆర్. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుంటే కొంత మంది దాన్ని వివాదం చేసారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘూట్ చిరస్ధాయిగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎన్టీఆర్ ఒక తరం నటుడు కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగు వారి గుండెల్లో ఉంటారు. ఈ చిత్రం చిరస్ధాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వేదికపై ఉన్న చిరంజీవి, వెంకటేష్ తదితర సినీ ప్రముఖులతో కలసి కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసే అవకాశం కల్పించాల్సిందిగా బాలకృష్ణను కోరుతున్నాను అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…వందవ సినిమా అంటే చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. గౌతమిపుత్ర శాతకర్ణి కథను ఎంచుకోవడమే తొలి విజయం. బాలయ్య చరిత్రలో అపూర్వమైన సినిమాగా నిలిచిపోతుంది. క్రిష్ డైరెక్టర్ అంటే విజయం తథ్యం.చారిత్రత్మక సినిమాకి సరైన డైరెక్టర్ అంటే క్రిష్ అని నా అభిప్రాయం.పాత్రలో ఇమిడిపోయి అందర్ని అలరించే బాలకృష్ణ ఇలాంటి పాత్రలో అవలీలగా రాణిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వంద రోజులు ఆడడం గగనం అవుతున్న ఈరోజుల్లో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సిల్వర్ జూబ్లీ కాదు గోల్డన్ జూబ్లీ ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ…గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం 100 రోజులు కాదు 200 రోజులు 1000 థియేటర్స్ లో ఆడాలి అన్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ…బాలయ్య వందవ సినిమాకి మొట్టమొదటి తెలుగు చక్రవర్తి కథను ఎంచుకోవడం గర్వించ దగ్గ విషయం. ముప్పై మూడు రాజ్యాలను జయించిన చక్రవరి కథ ఇది. మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ ఉగాది అనేది గౌతమిపుత్ర శాతకర్ణితోనే ప్రారంభం అయ్యింది. క్రిష్ కి ఈ సినిమా చేయాలనే ఆలోచన రావడం..బాలయ్య అంగీకరించడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయే బాలయ్య ఈ సినిమాతో చరిత్ర సృష్టించాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ…నా వందవ సినిమా కోసం ఎన్నో కథలు విన్నాను. అందులో కొన్ని కథలు నచ్చాయి. కొన్ని నచ్చలేదు. కొన్ని కథలు నచ్చినా వందవ చిత్రం స్ధాయికి తగ్గట్టు లేవు. కొత్తదనం కోసం తపిస్తూ నాన్నగారు ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. నాన్నగారు లాగే నేను కూడా కొత్త పాత్రలు పోషించాలని తపిస్తుండేవాడిని. ఆ తపనే నన్ను ముందుకు నడిపిస్తుంది. వందవ సినిమా స్ధాయికి తగ్గ కథను క్రిష్ చెప్పడంతో నేను అంగీకరించాను. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా మందికి తెలియదు. తెలంగాణలోని కోటిలింగాలులో పుట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి పరిపాలించాడు. మన తెలుగు చక్రవర్తి గురించి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా తెలియచేయాలి. నాన్నగారు నర్తనశాల సినిమా చేసేటప్పుడు ఎలాగైతే పరిశోధించి సినిమా చేసారో..అలా ఈ సినిమా కోసం చాలా మంది రీసెర్చ్ చేసి స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నారు. 1973లో నాన్నగారు నా నుదిట నట తిలకం దిద్దారు. అప్పడప్పుడు అపజయాలు వచ్చినా నా చిటికెన వేలును కూడా కదిలించలేదు. ఎన్నో శతదినోత్సవ చిత్రాల్లో నటించానంటే తల్లిదండ్రుల పుణ్యఫలం. తెలుగు ప్రజల అభిమాన బలం. ఈ చిత్రాన్ని నా అభిమానులకు భారతదేశంలో ఉన్న తల్లులకు అంకితం ఇస్తున్నాను. మన తెలుగు యోధుడు కథ ప్రపంచానికి తెలియాల్సి ఉంది. అందుకే ఈ చిత్రం చేస్తున్నాను. ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మనిషి కాదు. అదే నా జీవితం. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం కూడా అదే అని ఈమధ్య పుస్తకాలు చదవడం వలన తెలిసింది. ఆయనకు నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. తనని తాను ప్రేమించుకుంటూ ఎవర్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్లేవాడే డిక్టేటర్ అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ – బిబో శ్రీనివాసరావు, రచనా సహకారం – భూపతిరాజా, మాటలు – సాయిమాధవ్ బుర్రా, పాటలు – సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ భూపేష్ ఆర్.భూపతి, స్టిల్స్ – జీవన్ రెడ్డి, డి.ఓ.పి – జ్ఞానశేఖర్ వి.ఎస్, ఫైట్స్ – రామ్ లక్ష్మణ్, డాన్స్ – బృంద, ఎడిటింగ్ – సూరజ్, సంగీతం – దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు – వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, రచన – దర్శకత్వం – జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్)