ప్రముఖ నటి, నేత జయలలిత దక్షిణాది ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కొంతమంది మంచి నటిగా ఆరాధిస్తే.. మరికొంతమంది అమ్మగా కొలుస్తారు. ఆ ప్రజాధరణే ఆమె బయోపిక్ తీయడానికి ఉత్సాహాన్ని ఇస్తోంది. అనేక నిర్మాణ సంస్థలు జయలలిత జీవితాన్ని దృశ్యరూపం ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. విబ్రి మీడియా బ్యానర్ వారు జయలలిత బయోపిక్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించడానికి సిద్ధమయ్యారు. విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఓ తమిళ దర్శకురాలు రంగంలోకి దిగింది. ఈమె కూడా అదే ఫిబ్రవరి 24న జయలలిత బయోపిక్ ను ప్రారంభిస్తానని ప్రకటించింది. తాజాగా లెజెండరీ దర్శకుడు భారతీ రాజా జయలలిత బయోపిక్ ని తీస్తానని వెల్లడించారు.
అంతేకాదు జయలలిత పాత్ర కోసం బరిలో విద్యా బాలన్, కీర్తి సురేష్, నయనతార, ఐశ్వర్యారాయ్, అనుష్క పేర్లు వినిస్తున్నాయి. ఇదే విషయాన్నీ కీర్తి సురేష్ ముందు ఉంచగా ఆమె ఈ వార్తలను ఖండించారు. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. “జయలలితగారు గొప్పనటి. అంతకు మించిన గొప్ప నాయకురాలు. అలాంటి జయలలిత గారిలా నటించడం అంత తేలికైన విషయం కాదు. అంత ధైర్యం కూడా నాకు లేదు. అంతేకాదు జయలలిత పాత్రను గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు.” అని స్పష్టం చేశారు. మహానటి సినిమాలో సావిత్రిలా కీర్తి నటించి మంచి పేరు తెచ్చుకుంది. జయలలితలా కీర్తి నటిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.