మిస్ ఇండియా సినిమా రివ్యూ & రేటింగ్!

ఇండియాలో కాఫీ డేలు చాలా ఫేమస్. అమెరికన్ కాఫీకి మనవాళ్ళు అలవాటుపడ్డారు. ఒకవేళ ఆ అమెరికన్లకు మన టీను అలవాటు చేస్తే? అదీ పురుషాధిక్య వ్యాపార సామ్రాజ్యంలో కుట్రలు, కుతంత్రాలు దాటుకుని ఓ అమ్మాయి విజేతగా నిలిస్తే? ఐడియా బావుంది కదూ! మరి, ‘మిస్ ఇండియా’ సినిమా ఎలా ఉంది?

కథ: లంబసింగిలో సాధారణ బ్యాంకు ఉద్యోగి కుటుంబంలో జన్మించిన అమ్మాయి మానస సంయుక్త (కీర్తీ సురేష్). బాల్యం నుండి వ్యాపారవేత్తగా ఎదగాలనేది తన లక్ష్యం. కుటుంబ పరిస్థితుల కారణంగా అమెరికా వెళుతుంది. కుటుంబం అండగా లేకపోయినప్పటికీ… ‘మిస్ ఇండియా’ బ్రాండ్ తో ఛాయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఆమెకు కైలాష్ శివకుమార్ (జగపతి బాబు) అడ్డు తగులుతాడు. తన కె.ఎస్.కె. కాఫీ బ్రాండ్ వేల్యూ ‘మిస్ ఇండియా’ వల్ల పడిపోతుందని కుట్ర చేసి మానస వ్యాపారానికి భారీ నష్టం కలిగిస్తాడు. వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు వెళ్లిన మానస, ఒక్కసారి కిందకు పడుతుంది. మళ్ళీ ఎలా పైకి ఎదిగింది? అసలు కైలాష్ ఏం చేశాడు? మానస ప్రయాణంలో విక్రమ్ (సుమంత్ శైలేంద్ర) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు: కీర్తీ సురేష్ నటనకు గతంలో నేషనల్ అవార్డు వచ్చింది. ఆమె నటన గురించి కొత్తగా చెప్పేది ఏం ఉంటుంది? ‘మిస్ ఇండియా’లో మానస సంయుక్త పాత్రకు తగ్గట్టు నటించింది. పాత్రలో మానసిక సంఘర్షణను కళ్లలో పలికించింది. జగపతిబాబు స్టయిలింగ్, యాక్టింగ్, ఆ క్యారెక్టర్ రొటీన్ గా ఉన్నాయి. అయితే, సినిమాలో కీర్తీతో ఆయన సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ క్లిక్ అయ్యాయి. కొత్తగా ఉన్నాయి. టిపికల్ మిడిల్ క్లాస్ తెలుగు మదర్ పాత్రలో నదియాను చూడటం కొత్తగా ఉంటుంది. తెలుగులో ఆమె రిచ్ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ పాత్రలకు తగ్గట్టు హుందాగా నటించారు. నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత, దివ్య శ్రీపాద కథను ముందుకు తీసుకువెళ్లే పాత్రల్లో నటించారు.

సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ నరేంద్రనాథ్ మదిలో పుట్టిన ‘మిస్ ఇండియా’ ఐడియా బాగుంది. కానీ, ఐడియా చుట్టూ అల్లిన సీన్లు, స్క్రీన్ ప్లే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటే బాగుండేది. అయితే… కీర్తీ సురేష్ క్యారెక్టర్ ని బాగా రాసుకున్నారు. షీరోయిజం చూపించే ప్రతి సీన్ పేలింది. అయితే… ఫ్యామిలీ నేపథ్యంలో, బిజినెస్ వార్ నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు మరీ ఓవర్ డ్రమాటిక్ గా ఉన్నాయి. కొన్ని డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా జగపతిబాబుతో అమ్మాయి ఏం చేస్తుందో కీర్తీ సురేష్ చెప్పే డైలాగ్ కి థియేటర్లలో అయితే మహిళా ప్రేక్షకుల నుండి క్లాప్స్ పడేవి. కొన్ని డైలాగుల్లో ప్రాస కోసం ప్రయాస పడటం బాలేదు. స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందో, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో వుహించవచ్చు. రన్ టైమ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్బ్. కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ సంగీతం సినిమాకి మేజర్ అస్సెస్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లను ఎలివేట్ చేసింది. కీర్తీ సురేష్ షీరోయిజం చూపించే సన్నివేశాలకు ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాలో ఒక హైలైట్ అని చెప్పాలి.

విశ్లేషణ: మహిళలు తలుచుకుంటే సాధించలేదనిది ఏదీ లేదని సందేశం ఇచ్చే సినిమా ‘మిస్ ఇండియా’. విమెన్ ఎంపవర్‌మెంట్ గురించి గొప్పగా చెప్పారు. అయితే, రొటీన్ సీన్స్, ట్రీట్మెంట్ సినిమాకి కొంత మైనస్ గా నిలిచింది. కీర్తీ సురేష్ యాక్టింగ్, డైలాగులు, తమన్ సంగీతం కోసం రొటీన్ ని భరిస్తూ సినిమాను ఒకసారి చూడవచ్చు. రన్ టైమ్, రొటీన్ సీన్స్ ట్రిమ్ చేసి… సినిమాను క్రిస్పీగా చూపించి ఉంటే ఛాయ్ టైపులో సినిమా సూపర్ ఉండేది.

రేటింగ్: 2.5/5

ప్లాట్ ఫామ్ : నెట్‌ఫ్లిక్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus