KGF 2 Review: ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ సినిమా రివ్యూ & రేటింగ్!

2018 డిసెంబర్ 21వ తేదీ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఆడియన్స్ ఏ సినిమా చూడాలో తెలియక తికమకపడుతున్నారు. అయితే.. మీడియం రేంజ్ పబ్లిసిటీతో విడుదలైన కన్నడ చిత్రం “కె.జి.ఎఫ్”. చాలా మందికి ఈ సినిమా విడుదలైన విషయం కూడా తెలియదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సంచలనం సృష్టించిన చిత్రం “కె.జి.ఎఫ్”. కొన్ని కేంద్రాల్లో 50 రోజులు ఆడడమే కాక బి,సి సెంటర్ ఆడియన్స్ ఒన్ చేసుకున్న చిత్రమిది. ఈ ఊర మాస్ సినిమా సీక్వెల్ “కె.జి.ఎఫ్ 2” ఇవాళ విడుదలైంది. మరి మొదటి భాగంతో నమోదు చేసిన అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!

కథ: నరాచీని, కె.జి.ఎఫ్ ను దక్కించుకున్న రాకీ భాయ్ (యష్) తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు. తన శత్రువులకు సింహస్వప్నంగా ఉంటూనే తన మనుషులకు తోడూగా నిలుస్తాడు. ఈ క్రమంలో భారత ప్రధాని రమికా సేన్ (రవీనా టండన్)తో సైతం తలబడతాడు.

దేశ ప్రధానిని సైతం ఎదిరించిన ఇండియాస్ బిగ్గెస్ట్ క్రిమినల్ & బిజినెస్ మ్యాన్ రాకీ భాయ్ పయనం ఏమైంది? అనేది “కె.జి.ఎఫ్ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుల కోసం కొన్ని క్యారెక్టర్లు పుడతాయి, క్యారెక్టర్ల కోసం కొందరు నటులు పుడతారు. యష్ ఈ రెండో క్యాటగిరీకి చెందినవాడు. రాఖీ భాయ్ పాత్రలో అతడ్ని తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేం. జనాలు అతడి అసలు పేరు మర్చిపోయి రాకీ భాయ్ గానే అతడ్ని గుర్తించే స్థాయిలో పాత్రలో జీవించేశాడు యష్. ఫైట్స్ & డైలాగ్స్ మాత్రమే కాదు.. ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించాడు. యష్ కళ్ళల్లో కోపాన్ని ప్రేక్షకుడు కూడా ఫీల్ అవుతాడు. ఆ స్థాయిలో నటించాడు యష్.

యష్ తర్వాత తన ఇంటెన్స్ యాక్టింగ్ తో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచిన నటి రవీనా టండన్. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో ఆమె హుందాగా నటించడమే కాక.. ఆ పాత్ర వెయిట్ ను క్యారీ చేసింది. అలాగే సంజయ్ దత్ కూడా క్రూరమైన విలన్ గా ఆకట్టుకున్నాడు.

శ్రీనిధి శెట్టి పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఆమె క్యారెక్టర్ ఇచ్చే ఇంపాక్ట్ సినిమాకి భలే ప్లస్ అయ్యింది. రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ఈ సినిమా ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి గురించి మాట్లాడుకోవాలి. 19 ఏళ్ల ఈ కుర్రాడు తన ఎడిటింగ్ స్కిల్స్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కార్ ఛేజింగ్ సీక్వెన్స్ & ఫైరింగ్ సీక్వెన్స్ లను కట్ చేసిన విధానం హాలీవుడ్ స్థాయిని మించి ఉంది. అలాగే కలర్ గ్రేడింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. కె.జి.ఎఫ్ ప్రపంచంలోని ప్రేక్షకుల్ని లీనం చేశాడు కెమెరామెన్ భువన్ గౌడ. యాక్షన్ బ్లాక్స్ ఇలా కూడా తీయొచ్చు అని చూపించాడు. అలాగని ఏదో కొత్త ప్రయోగం చేయలేదు. రెగ్యులర్ ఫార్మాట్ లోనే సింపుల్ షాట్స్ తో అలరించాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఒక దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. రాకీ క్యారెక్టర్ ను రాసుకున్న విధానం, ఆ క్యారెక్టర్ ను ప్రతి సందర్భంతో మరింత బలోపేతం చేసిన తీరు ఆడియన్స్ కు ఎక్కడలేని హై ఇస్తుంది. రాకీ క్యారెక్టర్ మాత్రమే కాదు.. ప్రతి క్యారెక్టర్ ను కథకు అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం హర్షణీయం. సాధారణంగా ఇలాంటి మాస్ మసాలా సినిమాల్లో హీరో మినహా ఎవరికీ క్యారెక్టర్ ఆర్క్ అనేది కనిపించదు. కానీ “కె.జి.ఎఫ్ 2” ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. ఆ గ్రాఫ్ ను స్క్రీన్ మీద ప్రెజంట్ చేయడంలోనూ నీల్ సక్సెస్ అయ్యాడు. ఇక యష్ ఇచ్చిన ఎలివేషన్స్ భవిష్యత్ దర్శకులకు మాస్ క్లాసెస్ లాంటివి. ఏ ఒక్క యాక్షన్ సీన్ అనవసరం అనిపించదు, ఓ ఒక్క ఎపిసోడ్ లోనూ అతి కనిపించదు. అంత పకద్భందీగా సినిమాను రాసుకుని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్.

యష్, ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాకి మరో హీరో సంగీత దర్శకుడు రవి బస్రూర్. సౌండ్ డిజైనింగ్ విషయంలో అతడు తీసుకున్న శ్రద్ధ, నేపధ్య సంగీతంతో ప్రశాంత్ ఎలివేషన్స్ ను ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం. పాటల్లోనూ మంచి కిక్ ఉంది.

విశ్లేషణ: ఒక సగటు మాస్ సినిమాకి కావాల్సిన అంశాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రం “కె.జి.ఎఫ్ 2”. ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ గా ఉండడమే కాక, సినిమా మొదటి నుండి చివరి వరకూ రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతినిచ్చే చిత్రమిది. యష్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజన్స్, ప్రశాంత్ నీల్ అవుట్ స్టాండింగ్ సీన్ కంపోజిషన్, రవి బస్రూర్ బ్లాస్టింగ్ సౌండ్ డిజైన్ & బీజీయమ్ కోసం సినిమాని రిపీటెడ్ గా థియేటర్లలో చూడొచ్చు. ముఖ్యంగా అట్మోస్ థియేటర్లలో సినిమాని చూస్తే వచ్చే కిక్ వేరు. అది మిస్ అవ్వకూడదు. సినిమాకి ఉన్న క్రేజ్ కి సినిమా అవుట్ పుట్ ని చూస్తే.. రికార్డులు తిరగరాయడమే కాదు, సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఇక మూడో భాగానికి ఇచ్చిన ఇంట్రో ఇప్పట్నుండే “కె.జి.ఎఫ్ 3” ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేసేలా చేస్తుంది.

రేటింగ్: 4/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus