మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పై మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో కియరా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటించడంతో హిందీ ఆడియెన్స్ ను ఆకర్షించవచ్చని టీమ్ ఆశిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్-కియరా జంటగా రెండోసారి స్క్రీన్ పై కనపడబోతోంది. అయితే, ఈ చిత్రం కోసం నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలలో కియరా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రారంభోత్సవ ఈవెంట్ అయిన లక్నోలో మాత్రమే ఆమె పాల్గొనగా, ఇటీవల హిందీ బిగ్ బాస్ షోలో చరణ్‌తో కలిసి కనిపించారు.
కానీ, దాని తర్వాత కియరా (Kiara Advani) దక్షిణ భారతదేశంలో, విదేశాలలో జరిగే ప్రమోషన్ ఈవెంట్స్‌లో తారసపడలేదు. డల్లాస్ లో జరిగిన భారీ కార్యక్రమానికి అలాగే రాజమండ్రిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ కు కూడా దూరమయ్యారు. దీంతో కియరా సౌత్ ప్రమోషన్స్‌ను అంగీకరించలేదని, ఇష్టపడి దూరంగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇంతలోనే కియరా ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరారనే పుకార్లు పుట్టుకొచ్చాయి.
దీనిపై ఆమె టీమ్ వెంటనే స్పందించింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ కియరా (Kiara Advani) ఆసుపత్రిలో చేరలేదని, కేవలం కఠినమైన షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. హెక్టిక్ వర్క్ లోడ్ వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న కియరా, ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) ‘వార్ 2’ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేశారు.
ఈ ప్రాజెక్టులతో పాటు ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ పనులు చేయడం కష్టం కావడంతో కొంత సమయం విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలకంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో కియరా మిగిలిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టతలేదు. రిలీజ్ అనంతరం అయితే కచ్చితంగా కనిపించే అవకాశం ఉందని టాక్.