శివాజీ గణేశన్ నట వారసుడిగా, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ హీరో, నటుడు ప్రభు గణేశన్ ఇటీవల మెదడు సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అభిమానులందరినీ కలవరపెట్టిన ఈ వార్తకు ఇప్పుడు శుభం కార్డు పడినట్టు అయ్యింది. ప్రభు గణేశన్ విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లిపోయారు. చెన్నైలోని మెడ్‌వే హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది.
ప్రభు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన పీఆర్ఓ స్వయంగా వెల్లడించారు. “ప్రభు సార్‌కి చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు,” అని ఆయన తెలిపారు. దీంతో ఆయన అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభు జ్వరం, తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించగా, మెదడులోని ఒక ప్రధాన రక్తనాళంలో చిన్నపాటి వాపు (అన్యూరిజం) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
దీని కారణంగానే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మెడ్‌వే హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ టి. పళనియప్పన్ ఈ విషయంపై స్పందిస్తూ, “ప్రభు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ఇంటర్నల్ కరోటిడ్ ధమనిలో ఒక చిన్నపాటి సమస్యను గుర్తించాం. సకాలంలో స్పందించి, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశాం,” అని వివరించారు. ప్రభు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ప్రభు గణేశన్ 1980, 90…లలో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. తన కెరీర్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి 220కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, సహాయ నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఎన్నో మరపురాని పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు.ప్రభు త్వరలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘గుడ్ బాడ్ అగ్లీ’ చిత్రంలో కనిపించనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.