సంక్రాంతి సీజన్ టాలీవుడ్ లో ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా బిగ్ సినిమాగా బరిలో ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ లో చరణ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సులు, శంకర్ మార్క్ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. చరణ్ డ్యుయల్ రోల్ ప్లే చేయడం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కియారా అద్వానీ (Kiara Advani) , అంజలి (Anjali) కీలక పాత్రలు పోషించారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, గేమ్ ఛేంజర్ తొలిరోజు రూ.42 కోట్ల నుంచి రూ.47 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మౌత్ టాక్ బలంగా ఉంటే, ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తొలి రోజు రికార్డు అయిన రూ.45.7 కోట్లను దాటే అవకాశముంది. సంక్రాంతిలో ఇదే టాప్ రికార్డ్. ఇక చరణ్, మహేష్ బాబు (Mahesh Babu) రికార్డును బ్రేక్ చేసి, టాప్ సంక్రాంతి ఓపెనింగ్ గా నిలవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ పై ఉన్న అంచనాలు చరణ్ కెరీర్ కు మరో రికార్డ్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
శంకర్ గత చిత్రం ఇండియన్ 2 నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ చిత్రంతో శంకర్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చరణ్ శంకర్ కాంబినేషన్ టాలీవుడ్ ను కొత్త ట్రెండ్ ను తీసుకువెళ్లగలదని టాక్. మరి సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.