కిల్లర్

వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని అలరించే విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “కిల్లర్”. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్ర పోషించడం విశేషం. “బిచ్చగాడు” తర్వాత సరైన హిట్ లేక బాధపడుతున్న విజయ్ ఆంటోనీకి “కిల్లర్” అయినా విజయం సాధించి పెట్టిందా లేదా అనేది తెలుసుకొందాం..!!

కథ: వైజాగ్ లోని ఓ మారుమూల ఒక గుర్తు తెలియని శవం దొరుకుతుంది పోలీస్ ఆఫీసర్ కార్తికేయ (అర్జున్ సార్జా) & టీం కి. హత్య కాబడిన వ్యక్తి ఎవరు అనే విషయం తెలుసుకొనే క్రమంలో ఆ వ్యక్తి ఆఖరిసారి కనిపించింది ధరణి (ఆషిమా నర్వాల్) ఇంటి దగ్గరేనని తెలుసుకొంటాడు కార్తికేయ. అదే తరుణంలో ధరణి ఉండే ఫ్లాట్ కి ఆపోజిట్ లో ఉండే ప్రభాకర్ (విజయ్ ఆంటోనీ)ని కూడా ప్రశ్నిస్తాడు. మొదట్లో ఆ హత్యకు ధరణి & ప్రభాకర్ కు ఎలాంటి సంబంధం లేదనుకున్న కార్తికేయకు.. ఆ కేసును మరింత లోతుగా పరిశీలించే కొద్దీ నమ్మలేని నిజాలు బయటకొస్తుంటాయి.

ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది? అతడి హత్య చేసింది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “కిల్లర్” సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: అభిమన్యుడు తర్వాత అర్జున్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొన్న సినిమా ఇదే. ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. సినిమాకి హీరో విజయ్ ఆంటోనీ అనే కంటే అర్జున్ అంటే అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.

విజయ్ ఆంటోనీ మొట్టమొదటిసారిగా తాను నటించిన సినిమాకి కేవలం నటుడిగా మాత్రమే పరిమితమయ్యాడు. ఇదివరకూ విజయ్ నటించే ప్రతి సినిమాకి యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ ఎడిటర్ కమ్ వి.ఎఫ్.ఎక్స్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చిన విజయ్ ఈ సినిమాకి కేవలం యాక్టర్ గా మాత్రమే వ్యవహరించాడు. వేరియేషన్స్ చూపించడంలో ఎప్పట్లానే విఫలమయ్యాడు కానీ.. నటుడిగా మాత్రం కాస్త ఇంప్రూవ్ మెంట్ చూపించాడు.

“నాటకం, జెస్సీ” చిత్రాల ద్వారా ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆషిమా నర్వాల్ కూడా ఈ చిత్రంతో నటిగా ఇంప్రూవ్ మెంట్ చూపించింది. ఆమె తల్లి పాత్రలో సీత చాలాకాలం తర్వాత తెరపై కనిపించింది.

సాంకేతికవర్గం పనితీరు: మాక్స్ సినిమాటోగ్రఫీ వర్క్ & సైమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉన్నాయి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడంలో ఇద్దరూ సఫలీకృతులయ్యారు.

దర్శకుడు ఆండ్రూ కథ కంటే కథనం బాగా రాసుకున్నాడు. సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేయగలిగాడు. సాగతీత అనేది ఎక్కడా కనిపించలేదు. కాకపోతే.. పాటల ప్లేస్ మెంట్ మాత్రం కావాలని ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ఆ రెండు అనవసరంగా ఇరికించిన పాటలు తీసేసినా సినిమాకి పెద్ద మైనస్ ఏమీ లేదు. ఇకపోతే.. జరిగిన హత్య చుట్టూ అల్లిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బాగున్నాయి కానీ.. ఆ చిక్కుముడులను అర్ధవంతంగా విడదీయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయని క్లైమాక్స్ ఇవ్వాలనే తాపత్రయంలో అప్పటివరకూ చాలా లాజికల్ గా సాగిన క్రైమ్ థ్రిల్లర్ ను ఒక్కసారిగా బోరింగ్ రివెంజ్ డ్రామాగా మార్చేశాడు దర్శకుడు.

విశ్లేషణ: విజయ్ ఆంటోనీ సినిమాలంటే ఎలాగూ భారీ అంచనాలు ఉండవు కాబట్టి.. ఎక్కువగా ఏమీ ఎక్స్ పెక్ట్ చేయకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం ఓ మోస్తరు సాటిస్ఫేక్షన్ తో థియేటర్ బయటకొస్తారు ప్రేక్షకులు. విజయ్ కి సూపర్ హిట్ కాకపోయినా మూడేళ్లుగా ఎదురుచూస్తున్నందుకు ఓ యావరేజ్ హిట్ దొరికిందనే చెప్పాలి.

రేటింగ్: 2/5

 CLICK HERE TO READ IN ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus