తెలుగులో నారా రోహిత్ నటించిన సినిమాలు నెలకు ఒకటి చప్పున విడుదలై.. సదరు చిత్ర నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెడుతుండడం తెలిసిందే. ఈమధ్య మనోడు ఫ్లాపుల పరంగా హ్యాట్రిక్ కూడా కొట్టాడు. కానీ, రోహిత్ సినిమా పుణ్యమా అని తమిళ నిర్మాత మాత్రం జేబులు నింపుకొంటున్నాడు.
ఈ కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఏంటంటే.. తెలుగులో నారా రోహిత్ ఆఖరి చిత్రంగా పేర్కొనబడే “ప్రతినిధి”ని తమిళంలో “కో 2” పేరుతో రీమేక్ చేసారు. తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించిన శరత్ మండవ.. తమిళ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేసాడు. గత శుక్రవారం తమిళనాట విడుదలైన ఆ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. స్టార్ హీరోలెవరూ నటించకపోయినా.. కేవలం స్ట్రాంగ్ కంటెంట్ పుణ్యమా అని “కో 2” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. పరిమిత బడ్జెట్ తో రూపొందించబడిన ఈ చిత్రం అక్కడి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
అదండీ సంగతి.. మన నారా వారి కథానాయకుడైన నారా రోహిత్ సినిమాలు తెలుగు నిర్మాతలకు ఏమాత్రం లాభాలు తెచ్చిపెట్టకపోయినా, అతని రీమేక్ సినిమాలు మత్రం తమిళ నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్ ను రెండింతలు చేస్తుండడం గమనార్హం!