సినిమా రంగంలో సక్సెస్ సాధించిన సెలబ్రిటీలలో చాలామంది రాజకీయాల్లో కూడా సత్తా చాటాలనే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో కొందరు సెలబ్రిటీలు మాత్రమే సక్సెస్ అయ్యారు. కరుణానిధి మనవడు, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాతకు తగ్గ మనవడు అని ప్రూవ్ చేసుకున్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు.
ఉదయనిధి స్టాలిన్ తన పేరుపై 2019 – 2020 సంవత్సరానికిగాను రూ.4.89 లక్షల ఆదాయం ఉందని పేర్కొన్నారు. భార్య కిరుతిగ పేరు మీద కోటీ 15 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఉదయనిధి చెప్పారు. తన పేరుపై రూ.21.13 కోట్లు చరాస్థులు ఉన్నాయని, రూ.6.54 కోట్లు స్థిరాస్థులు ఉన్నాయని ఉదయనిధి వెల్లడించారు. భార్య, పిల్లల పేర్లపై రూ.26.67 కోట్ల రూపాయల స్థిరాస్థులు ఉన్నాయని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
అయితే ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటుందని తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ నటించిన సినిమాలు హిట్ అయినా ఈ హీరోకు స్టార్ డమ్ మాత్రం రాలేదు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్ 60వేల మెజారిటీతో గెలిచారు. అయితే ఈ హీరోపై 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. డీఎంకే ఆధ్వర్యంలో ధర్నాలు, అసెంబ్లీ ముట్టడి చేయడంతో ఉదయనిధి స్టాలిన్ పై కేసులు నమోదయ్యాయని సమాచారం.