భరత్ అనే నేను పార్ట్ 2 తీయడానికి నాకు ఇంకొంచెం సమయం కావాలి – కొరటాల శివ

‘నిజంగా కమర్షియల్ రీచ్ ఉండాలి అనుకుంటే.. ప్రెజంట్ పొలిటీషియన్స్ ని టార్గెట్ చేసి కొన్ని డైలాగ్స్ లేదా సీన్స్ రాసుకొని అటెన్షన్ డైవర్ట్ చేసేవాడ్ని. అయితే.. ఒక ఫిలిమ్ మేకర్ గా నేను అంత చీప్ గా బిహేవ్ చేయాలనుకోలేదు. అందుకే ‘భరత్ అనే నేను’లో ఎక్కడా నెగిటివిటీ కానీ.. ఒకరిని ఉద్దేశించి డైలాగులు కానీ ఉండవు” అంటున్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన నాలుగో చిత్రం ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుదలై.. దానయ్య, మహేష్ బాబు, కొరటాల శివల కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ విజయానందంలో మునిగితేలుతున్న కొరటాల శివ నేడు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..!!

ఈ సినిమాకి ఆ రెండూ దక్కాయి.. బేసిగ్గా మన తెలుగు సినిమాలకు అప్రిసియేషన్ వస్తే డబ్బులు రావు, డబ్బులు వస్తే అప్రిసియేషన్ రాదు అని ఒక అపవాదు ఉండేది. “భరత్ అనే నేను”తో ఆ జింక్స్ బ్రేక్ అయినందుకు ఆనంధంగా ఉంది. ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ రిపోర్ట్స్, ప్రశంసలు మాకు విపరీతమైన ఆనందాన్నిస్తోంది. ముఖ్యంగా కేటీయార్, జయప్రకాష్ నారాయణ్ లాంటి లీడర్స్ కూడా సినిమా చూసి మెచ్చుకోవడం, మా ప్రయత్నాన్ని అభినందించడం మాకు ఎనలేని ఆనందాన్నిచ్చింది.

ముందు అనుకొంటే రెండు పార్ట్శ్ గా తీసేవాళ్ళమేమో.. స్క్రిప్ట్ రాసుకొన్నప్పుడు కానీ సెట్స్ కు వెళ్ళేప్పుడు గానీ “భరత్ అనే నేను” చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేద్దామన్న ఆలోచన లేదు. అయితే.. స్క్రిప్ట్ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉంటాం కాబట్టి.. అనుకోకుండా కొన్ని సీన్స్ షూట్ చేశాం. చూసుకున్నప్పుడు చాలా మంచి అవుట్ పుట్ వచ్చిందని ఫీలయ్యాం. అయితే.. సినిమా రన్ టైమ్ కోసం చాలా సీన్స్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్స్ కూడా యాడ్ చేస్తే రెండు పార్ట్శ్ వస్తుందేమోనని అనుకొన్నామ్ కానీ.. షూట్ చేయడం అనేది చిన్న విషయం కాదు.

శ్రీహరి నానుతో కలిసి చాలా రీసెర్చ్ చేశాను.. “భరత్ అనే నేను” కథ నేనుఒక్కడిని రాసుకోలేను. నా స్నేహితుడు శ్రీహరి నాను ఈ పాయింట్ చెప్పాడు. అతనితో కలిసి చాలా మంది సీనియర్ పొలిటీషియన్స్, లీడర్స్ ను కలవడం జరిగింది. వాళ్ళందరు చెప్పిన విషయాలను కథలో జొప్పించి ఒక మంచి పోలిటికల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలిచాం.

మహేష్ అలా ఫ్యాన్సీ పొలిటీషియన్ లా కనిపించడం నాకు ఇష్టం లేదు.. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు అనగానే అందరూ ఈ సినిమాలో మహేష్ తెల్ల పంచెకట్టు లేదా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపిస్తాడేమో అనుకొన్నారు. అయితే.. వైట్ అండ్ వైట్ అనేది పొలిటీషియన్స్ యూనిఫార్మ్ కాదు. అందులోనూ లండన్ లో చదువుకొని వచ్చిన ఒక వ్యక్తి అలా వైట్ & వైట్ డ్రెస్ వేసుకోవడం బాగోదు, అలాగే కుర్ర సీ.యం కదా అని జీన్స్ వేయించలేను. అందుకే ఫార్మల్స్ బెటర్ అనిపించింది.

ఏ ముఖ్యమంత్రి స్పూర్తితోనూ రాసుకోలేదు.. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడు అని తెలియగానే అందరూ ఎవరి ఇన్స్పిరేషన్ గా కథ రాసుకొన్నారా అని ఆలోచించడం, సినిమా విడుదలయ్యాక నన్ను అడగడం మొదలెట్టారు. నేను ఏ ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకోలేదు. నేను ఇన్స్పైర్ అయ్యిందల్లా కేవలం వాజ్ పేయి, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి సమాజంలో, సమాజం కోసం పుట్టిన లీడర్స్ ను మాత్రమే.

వారసత్వంలో తప్పేముంది.. ఒక డాక్టర్ తాను కట్టుకొన్న హాస్పిటల్ కి తన కొడుకునే చీఫ్ గా నీయమించాలనుకొంటాడు. అలాగే ఒక హీరో కొడుకు హీరో అవుతాడు, అదే విధంగా తండ్రి చనిపోయాడు కాబట్టి సినిమాలో భరత్ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. అంతే తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు మన ఇండియాలో. వారసత్వానికి అంతలా ఫిక్స్ అయిపోయామ్ మనం.

వాటిని నేను హ్యూమన్ వేల్యూస్ అంటాను.. సినిమాలో లోకల్ గవర్నెన్స్, నాయకుడు అవసరం లేని సమాజ నిర్మాణం అనే అంశాలను ప్రస్తావించడాన్ని కొందరు నాలో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్న కారణంగానే ఈ అంశాలను స్పురించానేమో అనుకొన్నారు. కానీ.. ఇవన్నీ మనం నిత్యజీవితాల్లో ఏదో ఒక గట్టు మీదనో కూర్చుని, ఎవరో ఒకరితో చర్చించిన విషయాలే. వాటిని నిజజీవితంలో ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాబట్టి ఇలా సినిమాలో అయినా ప్రేక్షకులకు చూపించాలనుకొన్నాను.

మిర్చిలో తప్ప ప్రతి సినిమాలోనూ ఉంటుంది.. ఒక్క “మిర్చి” సినిమాలో తప్ప నేను ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాలోనూ హీరో క్యారెక్టర్స్ కి స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. వారి బిహేవియర్ కి రీజన్ ఉంటుంది. “జనతా గ్యారేజ్”లో హీరో పాత్రకి చిన్నప్పట్నుంచి మొక్కలంటే ఇష్టం, “శ్రీమంతుడు” సినిమాలో హీరో పాత్ర తన మనుషులతో కంటే అందరితోనూ కలిసిపోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అలాగే.. “భరత్” క్యారెక్టర్ కి కూడా చాలా స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ భరత్ పాత్రను అబ్జర్వ్ చేస్తే.. అతని వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు ఉండవు. లండన్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో ముఖ్యమంత్రిగా 8 నెలలపాటు వర్క్ చేసిన తర్వాత కూడా అలానే ఉంటాడు.

సమాజం కోసం సినిమా చేయను.. ఎప్పుడైనా సరే నేను కథ రాసుకొన్నప్పుడు సదరు సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారు. ఎంత కలెక్షన్ రావోచ్చు, నిర్మాత సేఫ్ అవుతాడా లేదా అనే విషయాల్ని మాత్రం దృష్టిలో పెట్టుకొంటాను. సమాజం కోసం మాత్రం సినిమా చేయను, ఆ విషయంలో నేను స్వార్ధపరుడ్ని. ముందు ఈ విషయాలన్నీట్లో సక్సెస్ అయితేనే నెక్స్ట్ సినిమా ద్వారా సమాజానికి అందించే మెసేజ్ గురించి ఆలోచిస్తాను.

భరత్ అనే నేను పార్ట్ 2 తీయాలంటే ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి.. సినిమా ఎడిట్ టేబుల్ దగ్గరకి వచ్చేవరకూ ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయవచ్చు అనే విషయం మాకు తెలియలేదు. కేవలం “లోకల్ గర్వర్నెన్స్” కాన్సెప్ట్ మీదే నేను చాలా వర్కవుట్ చేశాను. కేవలం ఆ టాపిక్ తోనే ఒక సినిమా తీయవచ్చు. అయితే.. కేవలం ఆ కాన్సెప్ట్ తోనే పార్ట్ 2 తీయలేమ్ కాబట్టి.. నాకు ఇంకాస్త టైమ్ కావాలి. ఇంకా రీసెర్చ్ చేస్తే కానీ “భరత్ అనే నేను 2” తీయలేను.

అందుకే ఆ తరహా ప్రమోషన్స్.. సాధారణంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అనగానే.. “ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్” అనే పదాలు వింటూనే ఉంటాం. కానీ.. “భరత్ అనే నేను” పోలిటికల్ డ్రామా. సో ఆడియన్స్ కి ఫస్ట్ లుక్ నుంచే సినిమా ఎలాంటిది అనే ఐడియా ఇవ్వాలి. అందుకే “ఫస్ట్ వోత్, సాంగ్ ఆఫ్ భరత్, విజన్ ఆఫ్ భరత్” వంటి పోలిటికల్ టెర్మినాలజీస్ వాడారు. మహేష్ మునుపటి చిత్రమైన “ఒన్ నేనొక్కడినే” విషయంలో సినిమా కంటెంట్ ఏమిటి అనే విషయం జనాలకి సరిగా రీచ్ అవ్వకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకే ఈ సినిమాలో విషయంలో జనాల్ని కన్ఫ్యూజ్ చేయకుండా సినిమాకి సంబంధించిన కంప్లీట్ ఐడియా విడుదలకు ముందే ఇచ్చేశామ్.

నెక్స్ట్ సినిమాలో మెసేజ్ మాత్రం ఇవ్వను.. గత నాలుగు సినిమాల్లో మెసేజులు ఇచ్చి నాకే బోర్ కొట్టింది. అందుకే నా తదుపరి చిత్రాన్ని ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలనుకొంటున్నాను. ఇంకా కథ, హీరో ఎవరు అనే విషయాలు ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతం కొన్నాళ్లపాటు హాలీడే ట్రిప్ కు వెళుతున్నాను. ఆ ట్రిప్ పూర్తయ్యాక తదుపరి సినిమా మీద కాన్సన్ ట్రేట్ చేస్తాను.

భవిష్యత్ లో సినిమాలు నిర్మిస్తాను.. నా అసిస్టెంట్స్ కావచ్చు లేదా ప్రతిభగల షార్ట్ ఫిలిమ్ మేకర్స్ కావచ్చు.. వాళ్ళతో భవిష్యత్ లో మంచి సినిమాలు నిర్మించాలన్న ఆలోచన ఉంది. బ్యానర్ ఏంటీ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus