మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ .. భరత్ అనే నేను.. ఇలా కొరటాల శివ తన సినిమాల్లో సందేశాన్ని మిళితం చేసి కమర్షియల్ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ లో శంకర్ కూడా కమర్షియల్ సినిమాల్తో మెసేజ్ లు ఇస్తుంటారు. అందుకే అభిమానులు కొరటాలకి టాలీవుడ్ శంకర్ గా పేరు పెట్టారు. తెలిసో.. తెలియకో మళ్ళీ తాజాగా శంకర్ బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేమిటంటే.. శంకర్ పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. కొత్త ప్రతిభని ప్రోత్సహిస్తుంటారు.
అదే విధంగా కొరటాల సొంత బ్యానర్ స్థాపించాలని అనుకుంటున్నారు. తక్కువ బడ్జెట్ తో పూర్తి అయ్యే మంచి కథలను నిర్మించాలని భావిస్తున్నారు. అయితే అందులోనూ మెసేజ్ ఉండాలని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా తన సోషల్ మీడియా వేదికపై కొరటాల ప్రకటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆ పని చేస్తే సినీ పరిశ్రమకు ప్రతిభకలిగిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు దొరికే అవకాశముంది. ఇక భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నట్లు టాక్. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.