Kota Bommali PS Review in Telugu: కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 24, 2023 / 05:07 PM IST

Cast & Crew

  • శ్రీకాంత్ (Hero)
  • వరలక్ష్మి శరత్ కుమార్ (Heroine)
  • రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీశర్మ తదితరులు.. (Cast)
  • తేజ మార్ని (Director)
  • బన్నీ వాసు - కొప్పినీడి విద్య (Producer)
  • మిధున్ ముకుందన్ - రంజిన్ రాజ్ (Music)
  • జగదీష్ చీకటి (Cinematography)
  • Release Date : నవంబర్ 24, 2023

మలయాళంలో మంచి విజయం సాధించిన “నాయట్టు” అనే చిత్రానికి రీమేక్ గా రూపొందిన చిత్రం “కోట బొమ్మాళీ పి.ఎస్”. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని “జోహార్” ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించాడు. సరిగ్గా ఎలక్షన్స్ టైంలో రిలీజైన ఈ పోలిటికల్ టార్గెట్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!

కథ: టెక్కలి నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక ఊహించని విధమైన మలుపు తిరుగుతుంది. అందుకు కారణం రామకృష్ణ (శ్రీకాంత్), రవి (రాహుల్ విజయ్), కుమారి (శివానీ రాజశేఖర్) ముఖ్యకారకులుగా మారుతారు. ఒక పెళ్ళికి వెళ్ళి వస్తుండగా.. వాళ్ళు అనుకోకుండా చేసిన ఒక యాక్సిడెంట్ లో ఆ నియోజకవర్గంలోని ఒక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు.

దాంతో ఆ యాక్సిడెంట్ చేసిన ముగ్గురు పోలీసుల కోసం మొత్తం పోలీస్ యంత్రాంగం వెతకడం మొదలెడుతుంది. ఈ రాజకీయ చదరంగంలో చివరికి ఎవరు గెలిచారు? ఎవరిది తప్పు? వంటి ప్రశ్నలకు సమాధానమే “కోట బొమ్మాళీ పి.ఎస్”.

నటీనటుల పనితీరు: ముగ్గురిలో సీనియర్ అయిన శ్రీకాంత్ తన నటనతో రామకృష్ణ పాత్రకు జీవం పోసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో శ్రీకాంత్ నటనకు విశేషమైన ప్రశంసలు లభించడం ఖాయం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో శ్రీకాంత్ కళ్ళతోనే నటించేశాడు. రాహుల్ విజయ్ మరోమారు తన సబ్టుల్ నటనతో అలరించాడు. శివాని రాజశేఖర్ కుమారి పాత్రలో ఒదిగిపోయింది.

మురళీశర్మ క్యారెక్టర్ & పంచ్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ అలరించింది. దయానంద్ రెడ్డి, విష్ణు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ టీం తక్కువ బడ్జెట్ తో పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ టెక్నికల్ ఎస్సెట్. నైట్ షాట్స్ ను మరీ డార్క్ గా కాకుండా.. డీసెంట్ లైటింగ్ తో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే.. కొన్ని ఫ్రేమింగ్స్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే ఆడియన్స్ కు కూడా నచ్చుతాయి. ఈ సినిమాకి మెయిన్ అటెన్షన్ తీసుకొచ్చిన “లింగి లింగిడి” పాట ప్లేస్మెంట్ & ఆ పాట తర్వాత వచ్చే ఇమ్మీడియట్ సీన్ ఆ పాటకు మరింత ప్రాధాన్యతనిచ్చాయి. నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది.

దర్శకుడు తేజ మార్ని పోలిటికల్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అని “జోహార్”తోనే ప్రూవ్ చేసుకున్నాడు. మధ్యలో వచ్చిన “అర్జున ఫల్గుణ”తో తడబడినా “కోట బొమ్మాళీ పి.ఎస్”తో తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా మలయాళ రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథకు చేసిన కొన్ని మార్పులు, ప్రస్తుత ఎలక్షన్స్ రచ్చకు తగిన విధంగా రాసుకున్న సంభాషణలు, సన్నివేశాలు అలరిస్తాయి. అయినప్పటికీ.. ఒరిజినల్ తో పోల్చినప్పుడు చేసిన క్లైమాక్స్ లో మార్పులు కొంత మందికి నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా మాత్రం దర్శకుడిగా తేజ మంచి విజయం సాధించాడనే చెప్పాలి.

విశ్లేషణ: కంటెంట్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుల కోసం తెరకెక్కిన చిత్రం (Kota Bommali PS)  “కోట బొమ్మాళీ పి.ఎస్”. సహజమైన నటన, సందర్భాలు, సంభాషణలు కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. అయితే.. రాజకీయ రణరంగపు సన్నాహాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ చిత్రం మంచి క్రేజ్ సంతరించుకోనుంది.


రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus