సరిగ్గా 34 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ ‘ముఖ్యమంత్రి’ అనే సినిమాలో టైటిల్ పాత్ర పోషించగా ఆ సినిమా ఘన విజయం సాధించి అప్పటి ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. ఒక స్టార్ హీరో పోలిటికల్ సినిమా చేయడమే చాలా అరుదైన ఆరోజుల్లో.. సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ముఖ్యమంత్రిగా టైటిల్ పాత్ర పోషించి సూపర్ హిట్ అందుకోవడమే కాక కలెక్షన్స్ పరంగా సరికొత్త ఒరవడిని సృష్టించాడు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆయన తనయుడు మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అలరించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “భరత్ అనే నేను” మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20న విడుదలవుతుందనే విషయం తెలిసిందే.
అయితే.. కృష్ణ నటించిన “ముఖ్యమంత్రి” విడుదలైన వారంలోనే అది కూడా 34 ఏళ్ల తర్వాత మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న “భరత్ అనే నేను” విడుదలవ్వడం ఆసక్తికరంగా మారింది. తండ్రి తరహాలోనే తనయుడు కూడా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం అనేది కామనే కాబట్టి ఘట్టమనేని అభిమానులు ఇప్పట్నుంచే సంబరాలు మొదలెట్టారు. మహేష్ బాబు సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతున్న ఈ చిత్రంపై కేవలం మహేష్ బాబు అభిమానుల్లోనే కాక సినిమాను అభిమానించే అందరిలోనూ విశేషమైన ఆసక్తి నెలకొని ఉంది.