కృష్ణార్జున యుద్ధం

  • April 12, 2018 / 09:20 AM IST

నేచురల్ స్టార్ నాని కంటే కూడా వరుస విజయాల నాని అని ఎక్కువగా పిలిపించుకొంటున్న నాని నటించిన తాజా చిత్రం “కృష్ణార్జున యుద్ధం”. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. “జెండాపై కపిరాజు, జెంటిల్మెన్” అనంతరం నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం పోషించడం విశేషం. ఈ సినిమా నాని హిట్ రేట్ ను పెంచిందా లేక స్పీడ్ కి బ్రేక్ వేసిందా అనే విషయం సమీక్షలో తెలుస్తుంది.

కథ : కృష్ణ (నాని) చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామంలో ఉండే మొరటోడు. అదే ఊరి సర్పంచ్ మనవరాలు రియా (రుక్సర్)ను ప్రేమిస్తాడు. అర్జున్ (నాని) యూరప్ లోని రిప్లబిక్ లో పాపులర్ రాక్ స్టార్. యూరప్ కి సరదాగా వచ్చిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమించి.. అప్పటివరకూ ప్లేబోయ్ లా తిరిగినవాడు సుబ్బలక్ష్మి కోసం మంచోడిగా మారతాడు.

ఈ ఇద్దరూ తమ ప్రియురాళ్లను కలవడం కోసం ఒకేసారి ఒకేరోజు హైద్రాబాద్ చేరుకొంటారు. కానీ.. అదే టైమ్ కి తాము ప్రేమిస్తున్న రియా, సుబ్బలక్ష్మిలు కిడ్నాప్ చేయబడ్డారని తెలుసుకొంటారు. కిడ్నాప్ చేయబడింది కూడా హ్యూమన్ ట్రాఫిక్కింగ్ గ్యాంగ్ కోసమని తెలుస్తుంది. సరిగ్గా 48 గంటల్లో వారిని రక్షించుకోకపోతే.. వారు ఎక్స్ పోర్ట్ అయిపోతారని తెలుసుకొంటారు. మరి 48 గంటల్లో రియా, సుబ్బలక్ష్మిలను కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి కాపాడుకోగలిగారా? అందుకోసం వారు చేసిన యుద్ధం ఏమిటి? అనేది “కృష్ణార్జున యుద్ధం” కథాంశం.

నటీనటుల పనితీరు : నటుడిగా నాని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఈ చిత్రంలో “రాక్ స్టార్ అర్జున్” అనే రోల్ లో మాత్రం తేలిపోయాడు. రాక్ స్టార్ యాటిట్యూడ్ కానీ, ఆ లుక్ కానీ నానిలో లేవు. ఇక కృష్ణ రోల్ లో నాని ఎమోషనల్ సీన్స్ మరియు యాస విషయంలో ఆకట్టుకోగలిగాడు కానీ.. ఇంటెన్సిటీ మాత్రం క్యారీ చేయలేకపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఉన్నంత ఇంటెన్సిటీ నానిలో కూడా ఉండి ఉంటే బాగుండేది.

అనుపమ అందంగా కనిపించింది, రుక్సర్ పర్వాలేదనిపించుకొంది. బ్రహ్మాజీ నవ్వించడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఎక్కువగా.. “ఫన్ బకెట్” ఫేమ్ మహేష్ తన చిత్తూరు యాసతో అలరించాడు. అతడి మాటలు జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక విలన్స్ గా ఒక పదిమంది కనిపిస్తారు కానీ.. వాళ్ళకి బిల్డప్ షాట్స్ ఉన్నంతగా క్యారెక్టరైజేషన్స్ లేకపోవడంతో వాళ్ళ క్యారెక్టర్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. అందువల్ల క్లైమాక్స్ లో వచ్చే భారీ ఫైట్ సీక్వెన్స్ చాలా పేలవంగా ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు : హిప్ హాప్ తమిజ సంగీతం కొత్తగా ఉంది, వినడానికి వాయిస్ అన్నీ కూడా భలే ఉన్నాయి కానీ.. నాని బాడీ లాంగ్వేజ్ కి ఆ సాంగ్స్ సింక్ అవ్వలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. డి.టి.ఎస్ ఎట్మాస్ లో సినిమా చూస్తే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది. ఇప్పటివరకూ ప్రతి సినిమాలోనూ కథ-కథనంతో సంబంధం లేకుండా తన కెమెరా వర్క్ తో మెప్పించే కార్తీక్ ఘట్టమనేని మొదటిసారి పేలవమైన ప్రదర్శన చేశాడనిపిస్తుంది. ఫ్రాగ్ లో చిత్రీకరించిన రేసింగ్ సీన్స్, హైద్రాబాద్ లో యాక్షన్ సీక్వెన్స్ లలో కార్తీక్ మార్క్ కెమెరా హ్యాండిలింగ్, ఫ్రేమ్స్ మిస్ అయ్యాయి.

పేలవమైన కథ కావడంతో నాని ద్విపాత్రాభినయాన్ని బేస్ చేసుకొని గాంధీ రాసుకొన్న ప్యారలల్ స్క్రీన్ ప్లే అనేది ఓ మోస్తరుగా ఉన్నా.. ఎడిటింగ్ ఇంకాస్త కట్టుదిట్టంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకొన్న కథలో దమ్ము లేదు, లాగే ప్యారలల్ స్క్రీన్ ప్లే “సింహా” తరహాలో కనెక్టెడ్ గా రాసుకోవడం కోసం పరితపించిన విధానం కాస్త ఇబ్బందిపెడుతుంది. ఇక ఫస్టాఫ్ ఏకంగా గంటన్నర సేపు సాగడం, సెకండాఫ్ చాలా చిన్న లైన్ మీద సాగుతూనే ఉండడం అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. తెర మీద ఇద్దరు నానీలు, వారి చుట్టూ బోలెడంత కథ లేని కథనం నడుస్తున్నా ప్రేక్షకుడు ఎక్కడా పెద్దగా ఎగ్జైట్ అవ్వడు. పైగా.. అసందర్భంగా వచ్చే పాటలు ఇంకాస్త చిరాకు తెప్పించేలా ఉన్నాయి. సో, స్క్రీన్ ప్లే & డైలాగ్ రైటర్ గా పర్వాలేదనిపించుకొన్న మేర్లపాక గాంధీ దర్శకుడిగా మాత్రం బొటాబోటి మార్కులతో పాస్ కి ఫెయిల్ కి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

విశ్లేషణ : సినిమాలు హిట్ అవుతున్నా.. నటుడిగా నాని పర్వాలేదు అనిపించుకొంటున్నా.. కథల ఎంపిక విషయంలో నాని డీసెషన్ మేకింగ్ మాత్రం “మజ్ను, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి” లాంటి సినిమాలతో తేలిపోయింది. అయితే.. ఆ మూడు సినిమాల్లో కామెడీ కాస్తో కూస్తో వర్కవుట్ అయ్యింది కాబట్టి జనాలు నాని చేసిన చిన్న చిన్న తప్పుల్ని క్షమించి ఆ సినిమాల్ని ఆదరించారు. అయితే.. ఇప్పుడు “కృష్ణార్జున యుద్ధం” విషయంలో మాత్రం ప్రేక్షకులు కనికరించే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తోంది. కారణం పేలవమైన కథ, సాగదీసిన కథనం. అందులోనూ బాక్సాఫీస్ వద్ద “రంగస్థలం” ర్యాంప్ ఆడేస్తుండడం, వచ్చే వారం మహేష్ “భరత్ అనే నేను”తో రెడీగా ఉండడంతో “కృష్ణార్జున యుద్ధం” నాని సక్సెస్ స్ట్రీక్ కి బ్రేక్ వేసినట్లే.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus