ఎక్కడ కెరీర్ ప్రారంభించిన వారు అక్కడికే వెళ్లడం ఈ మధ్య పెరుగుతోంది అని చెప్పాలి. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ భోర్సే కొత్తగా బాలీవుడ్ సినిమాను ఓకే చేసింది అనే వార్తలు వచ్చాయి. జాన్ అబ్రహమ్ సినిమాతో భాగ్యశ్రీ.. బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోందని మొన్నీమధ్యే చదువుకున్నాం. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ ఇదే పనిలో ఉందట. తెలుగులో తొలి సినిమాతోనే రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన కృతి శెట్టినే ఇప్పుడు హిందీ పరిశ్రమలోకి వెళ్తోందట. ఈ మేరకు ఓ డెబ్యూ హీరో సినిమాను ఓకే చేసిందని అంటున్నారు.
తెలుగులో ఇప్పుడేం సినిమాలు లేకపోయినా.. తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టి.. ఓ బాలీవుడ్ కథకు ఓకే చెప్పిందట. ప్రముఖ హిందీ నటుడు గొవిందా కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఓకే చేశారట. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్న ఈ ప్రాజెక్ట్.. ఓ సౌత్ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. అది కూడా కృతి శెట్టిన నటించిన సినిమానే అని అంటున్నారు.
హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘సూపర్ 30’ సినిమాతో ఆరేళ్ల క్రితం నటిగా కెరీర్ ప్రారంభించింది కృతి శెట్టి. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలోనే కనిపించింది. ఇప్పుడు ఈ సినిమాతో అక్కడ హీరోయిన్గా కెరీర్ స్టార్ చేస్తోందట. ఇప్పటికే ఇలా సౌత్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలీల బాలీవుడ్ వెళ్లి అక్కడ వరుస సినిమాలు ఓకే చేస్తోంది. ఇప్పుడు కృతి కూడా ఇలానే వెళ్తే మరో యంగ్ హీరోయిన్ కోసం సౌత్ సినిమా వెతుక్కోవాల్సి వస్తుంది మరి.
ఇక కృతి సినిమాల సంగతి చూస్తే.. ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, కార్తి ‘వా వాతియార్’, జయం రవి ‘జీనీ’ సినిమాల్లో నటిస్తోంది. ఇక పైన చెప్పినట్లుగా తెలుగు సినిమాలైతే ఏవీ ఆమె చేతిలో లేవు.