సినీ పరిశ్రమకు తమ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు తమ అనుభవాలను మనతో పంచుకోనున్నారు. ఇందుకు యూట్యూబ్ వేదిక కానుంది. ఇవి ఈ పరిశ్రమలో ఎదగాలనే వారికి ఎంతో ఉపయోగ పడనున్నాయి.
శత చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. రెండు తరాల హీరోలతో హిట్ లు సాధించిన డైరెక్టర్. ఆయన తను ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకున్నవి, పరిశీలించినవి చెప్పనున్నట్లు ప్రకటించారు. “నా సినిమా కెరీర్ లో మరో చాప్టర్ – KRR Classroom… భావితరాలకు సినిమా మేకింగ్ లో అన్ని కళలపై అవగాహన కల్పించేలా ఎపిసోడ్స్ ని షూట్ చేసి Youtube లో అప్లోడ్ చేస్తాను. అందరు ఉచితంగా వీడియోస్ ని చూడవచ్చు. సినిమా రంగంపై ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవచ్చు. నా కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి నన్నెంతో అభిమానిస్తున్న, నాకెంతో బలాన్నిస్తున్న, నా స్నేహితులు, ప్రేక్షకులకు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.. త్వరలోనే క్లాసులు ప్రారంభం.” అని కొన్ని రోజుల క్రితం తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేశారు.
కెఆర్ ఆర్ క్లాస్ రూం కొత్త దర్శకులతో పాటు సినిమాలు తీసినా వారికి కూడా ఉపయోగ పడుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పటికే కొంతమంది తెలుగు రైటర్లు ఇండస్ట్రీ లోకి రాబోతున్న వారిని ఇంటర్వ్యూ ల ద్వారా పలు సూచనలను అందజేశారు. ఇప్పుడు అప్పుల అప్పారావు, హలో బ్రదర్, హిట్లర్ వంటి సినిమాలకు రైటర్ గా పనిచేసి, అనేక చిత్రాల్లో హాస్య నటుడిగా అలరించిన ఎల్ బీ శ్రీరాం పొట్టి చిత్రాల ద్వారా తన ప్రతిభను చూపించనున్నారు. ఎల్ బీ (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్) క్రియేషన్స్ బ్యానర్ ఫై … ఎల్ బీ శ్రీరాం హార్ట్ ఫిల్మ్స్ పేరిట షార్ట్ ఫిల్మ్స్ నిర్మించనున్నారు. వీటికి కథ మాటలు అందించడమే కాదు నటించనున్నారు. యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాలు కూడా యువ రచయితలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ విధంగా సినీ మహాను భావులు లెసన్స్ చెప్పడం తో మరికొంత మంది ముందుకొచ్చి తమ అనుభవాలను చెప్పుకుంటారు. అవి ఎందరికో గ్రంధాలు కావడం ఖాయం.