కామెడీ సినిమాలు అంటే ప్రాణం పెట్టేవారికి.. ‘లేడీస్ టైలర్’ కేవలం సినిమా కాదు. అదొక ఎమోషన్. సినిమాలో రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆయనకు తగ్గట్టే మిగిలిన నటులు సూపరో సూపర్ అనిపిస్తారు. ఆ సినిమాలో కామెడీయే కాదు.. కొన్ని వన్‌లైనర్లు కూడా ఉంటాయి. వీటన్నింటికి మించి ఎవరూ ఊహించని హీరో – హీరోయిన్ కాంబినేషన్ ఉంటుంది. అర్చనతో రాజేంద్రుడి మాటలు, చేతలు భలే నవ్విస్తాయి. ఆ కాంబో ఇప్పుడు రిలపీట్ కాబోతోంది. అది కూడా 37 ఏళ్ల తర్వాత.
‘లేడీస్ టైలర్’ సినిమాలో నటించిన తర్వాత ఇన్నాళ్లకు రాజేంద్ర ప్రసాద్, అర్చన మళ్లీ నటిస్తున్నారు. ‘షష్టిపూర్తి’ అనే సినిమా కోసం ఈ ఇద్దరూ జట్టు కడుతున్నారు. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్నారు. పవన్ ప్రభ ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోస్‌లో ఇటీవల ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, జూలైలో సినిమాను విడుదల చేస్తారట.
రాజేంద్ర ప్రసాద్, అర్చన నటించిన ‘లేడీస్ టైలర్’ (Ladies Trailer) సినిమాకు కూడా ఇళయరాజానే సంగీతం అందించారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న సినిమాకు మళ్లీ ఆయనే సంగీతం అందిస్తుండటం గమనార్హం. మరి హీరో హీరోయిన్లుగా వీరిద్దరూ నటించిన సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. మరిప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
ఇక టైటిల్‌లో చెప్పిన ‘జమ జచ్చ’ అంటే ఏంటి అనే డౌట్ పడుతున్నారా? అయితే మీరు ‘లేడీస్ టైలర్’ సినిమా చూడనట్లే. ఎందుకంటే ఆ సినిమాలో రాజేంద్రుడు జ భాషలో మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటారు. ‘మచ్చ’ నేపథ్యంలో సాగే ఆ కథను జ భాషలతో ‘జమ జచ్చ’ అంటూ ఉంటారాయన. దానికితోడు తనదైన హిందీ భాషలో మాట్లాడే సన్నివేశాలూ అదిరిపోతాయి.