ఆస్కార్ అవార్డుల నామినేషన్లలో చోటు సంపాదించడం అంత ఈజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు ఆ అవార్డు నామినేషన్ కోసం పోటీ పడతాయి. అయితే ఆ పోటీ కోసం ఆ దేశంలో వందల సినిమాలతో పోటీ పడి మరీ ఓ సినిమా వస్తుంది. అంతటి పోటీని దాటుకొని ఓ సినిమా ఆస్కార్ నామినేట్ అయింది అంటే చాలా గొప్ప. అలాంటి ఘనతను 24 ఏళ్ల క్రితం సాధించిన బాలీవుడ్ సినిమా ‘లగాన్’. ఈ సినిమా ఇలాంటి ఇంట్రడక్షనా అని అనుకోవచ్చు.
ఎందుకంటే ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా అంటే సరిపోతుంది కదా అని అనొచ్చు. మామూలుగా అయితే అలానే అనొచ్చు. కానీ ఈ సినిమా హీరో కంటే ఆ సినిమా సాధించిన ఘనతనే హైలైట్ చేద్దామనేది మా ఉద్దేశం. పన్నుల భారం నుండి ఉపశమనం పొందడానికి బ్రిటిషు వారితో ఓ గ్రామస్థుల బృందం క్రికెట్ ఆడిన కథతో ఈ సినిమా రూపొందింది. ఆ సినిమా కథ బరువు ఏకంగా 74వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా విభాగంలో నామినేషన్‌ను దక్కించుకునేలా చేసింది.
2001లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాంటి సినిమా 25వ వార్షికోత్సవం సందర్భంగా రీ రిలీజ్ చేయాలని టీమ్ రెడీ అయింది. ప్రతి హృదయాన్ని తాకిన అద్భుతమైన కథ ‘లగాన్’ మరోసారి వెండి తెరపైకి వస్తోంది. జూన్ 12 నుండి 14 తేదీల్లో థియేటర్లలో మళ్లీ ఆ మ్యాజిక్ చూడండి అంటూ సినిమా నిర్మాణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. మరి రీరిలీజ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఇక ‘లగాన్’ సినిమా 49వ జాతీయ చలచచిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు ఎనిమిది అవార్డులు అందుకుంది. మరిప్పుడు అవార్డులు అయితే రావు కానీ.. వసూళ్లు, మేనియాను ఓ వారంలో అయితే చూడొచ్చు.