లోకేశ్ కనగరాజ్.. ఇండియన్ సినిమాలో నాకింత పారితోషికం కావాలి అని గట్టిగా అడిగి మరీ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న దర్శకుడు. అయితే ఇదంతా ‘కూలీ’ సినిమా రానంతవరకే. ఆ సినిమా ఫలితం వచ్చాక (వసూళ్ల సంగతి వదిలేసి) మొత్తం మారిపోయింది. ఆయన చేతికి వచ్చిన ఓ మల్టీ‘సూపర్‌స్టారర్’ సినిమా జారిపోయింది. మరో స్టార్ హీరోతో ఓకే అనుకున్న సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియకుండా పోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఓకే అయింది.
ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది. అదే ఈ సినిమా కూడా ఆగిపోయింది అని. తొలుత సినిమా కథ పాయింట్ ఓకే అనుకున్నారని.. కానీ తర్వాత సిట్టింగ్స్‌లో కథ విషయంలో అల్లు అర్జున్ సంతృప్తిగా లేరు అని చెబుతున్నారు. అదేంటి సినిమా గురించి ఓ టీజర్ సాంగ్ లాంటిది కూడా రిలీజ్ చేశారు కదా అంటారా? అందులో సినిమా కాన్సెస్ట్, సినిమా కాంబినేషన్ మాత్రమే చెప్పారు. ఎందుకంటే అప్పటికి కథ ఇంకా రెడీ కాలేదు అని కోడంబాక్కం వర్గాల సమాచారం.
దీనికి కారణం.. గత కొన్ని రోజులుగా లోకేశ్ కనగరాజ్ చెన్నై నుండి హైదరాబాద్ వచ్చింది లేదు. దీంతో బన్నీ – లోకీ మధ్యలో కమ్యూనికేషన్ ఆగిపోయిందని, సినిమా ఆగిపోయినట్లే అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఈ సినిమా ఆగిపోలేదని సమాచారం. ప్రస్తుతం లోకేశ్ హీరోగా నటించిన ‘డీసీ’ సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి. అందువల్ల అల్లు అర్జున్ సినిమా పనులు కాస్త హోల్డ్‌లో పెట్టారట. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పనులు మొదలుపెడతారట.
మరోవైపు ప్రముఖ రచయిత రత్న కుమార్ పరోక్షంగా ఈ సినిమా వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్న కుమార్ ఓ పోస్ట్ పెట్టారు. ఆ సినిమా ప్రారంభంలో లోకేశ్ కనగరాజ్ పెట్టిన పోస్ట్‌ను షేర్ చేస్తూ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ఆయన సినిమాల్లో భాగమైనందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. దాంతోపాటు అల్లు అర్జున్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా ఇంకా ఆగలేదు అనే క్లారిటీ కూడా వచ్చినట్లయింది.