కుటుంబ కథలకు కమర్షియల్ హంగులు జోడించి విజయాలు అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరో మచ్చ పడింది. ఇది వరకు హాలీవుడ్ సినిమాల్లోని అనేక సన్నివేశాలను సేమ్ టు సేమ్ తన సినిమాలో దించినప్పటికీ డైరక్టర్ ని తెలుగువారు అభిమానించారు తప్ప.. విమర్శించలేదు. తొలి సారి అ..ఆ సినిమాతో త్రివిక్రమ్ దొరికిపోయారు. మీనా కథని మళ్ళీ తీసి తన కెరీర్ కి మచ్చ తెచ్చుకున్నారు. తర్వాత లెంపలేసుకున్నాకూడా విమర్శకులు వదల్లేదు. త్రివిక్రమ్ కూడా మారలేదు. ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్ ను సేమ్ టు సేమ్ తెలుగులోకి అజ్ఞాతవాసిగా అనువదించారు. ఈ విషయాన్నీ సినిమా రిలీజ్ కి ముందు నుంచి సినీ విశ్లేషకులు మొత్తుకుంటున్నా చిత్ర బృందం స్పందించలేదు.
అసలు ఆ సినిమా స్పూర్తితో రాసుకున్నానని త్రివిక్రమ్ ప్రకటనకూడా చేయలేదు. ఈ రోజు లార్గో వించ్ డైరక్టర్ ట్వీట్ తో త్రివిక్రమ్ పరువు పోయింది. పవన్ కళ్యాణ్ తో ఆయన తెరకెక్కించిన అజ్ఞాతవాసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాని చూసిన లార్గో వించ్ డైరక్టర్ జెరోమ్ సల్లే ట్విట్టర్లో ” లీ బ్రాడీ లో అజ్ఞాతవాసి చిత్రం చూశా. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా చిత్రం నచ్చింది. నా లార్గో వించ్ కథకు, అజ్ఞాతవాసి చిత్ర కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి” అని ట్వీట్ చేశారు. మరి దీనిపై త్రివిక్రమ్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.