మలయాళ “ప్రేమమ్” సినిమా చూసి ఆమెకు ఆగరోత్తుల పోగ లాంటి ఆమె కురులకు హారతులిచ్చారు మన తెలుగు కుర్రాళ్ళు. ఇక అమ్మడు డైరెక్ట్ గా తెలుగు తెర మీద కనిపించినప్పుడు ఆమెకు గుండెల్లో గూడు కట్టేశారు. కెరీర్ తొలినాళ్లలోనే సొంత డబ్బింగ్ చెప్పుకోవడంతోపాటు మంచి కథలు ఎంచుకుంటూ యువ కథానాయికల రేస్ లో మొదటి స్థానానికి చేరువలో నిలిచిన అనుపమ.. అనంతరం కథల ఎంపికలో కొన్ని తప్పులు చేసి వరుస పరాజయాలు మూటగట్టుకుంది. ముఖ్యంగా.. “ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, కృష్ణార్జున యుద్ధం” చిత్రాలు వరుసబెట్టి డిజాస్టర్స్ గా నిలవడంతో అప్పటివరకూ నల్లేరు మీద నడకలా సాగిన అనుపమ కెరీర్ ఒక్కసారిగా నిప్పుల్లో పడ్డట్లు అయ్యింది. దాంతో అప్పటివరకూ క్యూ కట్టిన ఆఫర్లు ఒక్కసారిగా మాయమైపోయాయి.
ప్రస్తుతం అమ్మాయి చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా “హలో గురు ప్రేమకోసమే”. రామ్ కథానాయకుడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ గురువారం విడుదలవుతోంది. దసరా సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ.. కంటెంట్ పరంగా మంచి హిట్ కొట్టే అవకాశాలున్నాయని మాత్రం చిత్రబృందం విశ్వసిస్తోంది. మరి వాళ్ళ నమ్మకం ఎలా ఉన్నా.. ఈ సినిమా విజయం అనుపమ పరమేశ్వరన్ కెరీర్ కు చాలా కీలకం కానుంది.