లా సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 17, 2020 / 10:17 PM IST

“కేజీఎఫ్”తో ప్రపంచాన్ని తమవైపుకు తిప్పుకొంది కన్నడ సినిమా ఇండస్ట్రీ. అప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ సినిమాల రీమేకులు మరియు బీగ్రేడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన కన్నడ సినిమా ఎదుగుదల మొదలైంది అప్పటినుంచే. ఆ తర్వాత కొన్ని కన్నడ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన “దియా, లావ్ మాక్ టైల్” చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఆ బాటలోనే సినిమా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొన్న కొత్త కన్నడ చిత్రం “లా”. ట్రైలర్ తోనే విశేషంగా ఆకట్టుకొన్న ఈ చిత్రం ఇవాళ అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!


కథ: నందిని (రాగిణి ప్రజ్వల్) ఒక లా స్టూడెంట్. తల్లి లేని పిల్ల, తండ్రి ప్రేమతో గారాబంగా పెరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఆమె లాయర్ అవ్వబోతోంది అనగా ఆమెను సమాజంలో ముగ్గురు ప్రముఖుల కుమారులు గ్యాంగ్ రేప్ చేశారని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి, ఆ తర్వాత కోర్టులో తన కేసును తానే వాదించుకోవడానికి సన్నద్ధమవుతుంది. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ సంఘంలో పేరున్న మనుషులు వాళ్ళ కుమారులను కేసు నుంచి తప్పించడానికి ఎలాంటి దారులు తొక్కారు? అనేది “లా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: కొత్తమ్మాయి రాగిణి ప్రజ్వల్ తాను పోషించిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయినా పర్వాలేదనిపించుకొంది. ఆమె పాత్ర ఎవరైనా సీనియర్ హీరోయిన్ చేసి ఉంటే ఇంకాస్త వెయిట్ యాడ్ అయ్యేది. మిగతా కన్నడ నటులు కూడా పేరున్నవారే కానీ.. వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎందుకో వారి క్యారెక్టర్స్ అన్నీ పేలవంగానూ, వారి నటన మెటీరియలిస్టిక్ గానూ ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: “గ్యాంగ్ రేప్ కాబడిన అమ్మాయి తానే తన రేప్ కేసును కోర్టులో వాదించుకోవడం” అసలు ఈ పాయింట్ చాలు సినిమా మొత్తాన్ని నడిపించడానికి. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. కానీ.. దర్శకుడు ఈ పాయింట్ ను కేవలం ఓపెనింగ్ బ్లాక్ గా వినియోగించుకొని.. రివెంజ్ డ్రామాగా సినిమాను అనవసరంగా సాగదీసిన తీరు మాత్రం శోచనీయం. ఒక క్రేజీ పాయింట్ ను వేస్ట్ చేశాడనిపిస్తుంది.

ఇక కథనాన్ని నడిపిన విధానం, క్లైమాక్స్, జస్టిఫికేషన్ చాలా సిల్లీగా ఉంటాయి. ఒక మంచి పాయింట్ ను, బ్యాడ్ ఫిలిమ్ మేకింగ్ ఎలా పాడుచేయగలదు అనేందుకు ఈ చిత్రం ఒక చక్కని ఉదాహరణ. ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి అవసరమైన ఎంగేజింగ్ ప్లాట్ సినిమాకి లేకపోవడం, కీలకమైన ట్విస్ట్ ను ఇంటర్వెల్ లోనే రివీల్ చేయడంతో సెకండాఫ్ సినిమా చూడాలన్న ఆసక్తి కూడా ఉండదు.  సంగీతం, కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకొనే స్థాయిలో లేవు.

విశ్లేషణ: అనవసరమైన హైప్ కు బలైన సంచలనాత్మక స్టోరీ పాయింట్ “లా”. అటు పెర్ఫార్మెన్స్ కానీ ఇటు డీలింగ్ కానీ ఏదీ బాగోకపోవడంతో భారీగా బోర్ కొట్టించే సినిమాగా మిగిలిపోయిందీ చిత్రం.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus