తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ (కె.విశ్వనాథ్) (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఫిబ్రవరి 19, 1930న గుంటూరు జిల్లా రెపల్లేలో జన్మించిన కె.విశ్వనాథ్ తెలుగు చలనచిత్ర సీమలో లెజెండరీ దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా సుపరిచితమే. ఈ క్రమంలో ఆయనకు జాతీయ పురస్కాలు, నంది పురస్కారాలు ఎన్నో దక్కాయి. 1992లో ఉమ్మది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగాను 2017లో దాదాసాహెబ్ పురస్కారం కూడా అందుకున్నారాయన.
ఆడియోగ్రాఫర్ సినిమాల్లో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన కె.విశ్వనాథ్ తన లాంగ్ కెరీర్‌లో 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఆత్మ గౌరవం’, ‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగరసంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయం కృషి’, ‘స్వర్ణకమలం’, ‘సూత్రధారులు’, ‘శుభసంకల్పం’… ఇలా ఒక్కటేంటి అన్నీ అద్భుతమనే చెప్పాలి. కళలు, సంప్రదాయాల మీద ఆయన సినిమాలు ఎక్కువగా తెరకెక్కేవి. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు దూసుకుపోతున్న సమయంలోనే ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణించారు. ఆయన సినిమాలు కొన్ని రష్యన్ భాషలోకి డబ్బింగ్ చేశారు కూడా. వాటిని మాస్కోలోని థియేటర్లలో విడుదల చేశారు.
కె.విశ్వనాథ్ తన కెరీర్‌లో తొమ్మిది బాలీవుడ్ సినిమాలను కూడా తెరకెక్కించారు. వాటితోపాటు టీవీ సీరియళ్లలోనూ నటించారు. దర్శకుడిగా ఆయన ఆఖరి సినిమా ‘శుభప్రదం’. ఈ సినిమాలో 2010లో వచ్చింది. నటుడిగా అయితే 2016లో వచ్చిన ‘హైపర్’లో ఆఖరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. గతేడాది ‘ఒప్పండ’ అనే కన్నడ సినిమాలో నటించారు.