సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు మరణించారు. తాజాగా దిగ్గజ గాయిని ఆశా భోంస్లే మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.
గుండెపోటుతో ఆమె మృతి చెందారు. ఆశా భోంస్లే వయసు 92 ఏళ్ళు. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది అనే చెప్పాలి. ఆమె తన గాత్రంతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలను ఉర్రూతలూగించింది.
ఆశా భోంస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదు, ఆమె గాత్రంతో సినిమా పాటకి ఒక అరుదైన గుర్తింపుతెచ్చిన ధ్రువతార అనే చెప్పాలి.20కి పైగా భాషల్లో కొన్ని వేల సంఖ్యలో పాటలు పాడి ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరారు.శాస్త్రీయ సంగీతం, మెలోడీ, పెప్పీ సాంగ్స్, గజల్స్.. ఇలా ఎటువంటి పాతకైనా ఆమె తన గాత్రంతో ప్రాణం పోసేవారు. లతా మంగేష్కర్ సోదరిగా సంగీత సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆశా భోంస్లే.
దాదాసాహెబ్ ఫాల్కే వంటి ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమె పాటలు మార్మోగాయి. ఇక ఆశా భోంస్లే అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించనున్నారు. సినీ పరిశ్రమకి ఆమె చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం ఘన వీడ్కోలు పలకనుంది.సినిమా పాట ఉన్నంత వరకు, సంగీతం బ్రతికున్నంత వరకు ఆశా భోంస్లే గారి స్వరం నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.