Liger Review: లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం “లైగర్”. టైటిల్ ఎనౌన్స్ మెంట్ తర్వాత, రీసెంట్ గా రిలీజ్ చేసిన సెన్సేషనల్ విజయ్ న్యూడ్ ఫోటో పుణ్యమా అని వార్తల్లోకెక్కి, కాస్త జనాల్ని ఆకర్షితులను చేసిన ఈ చిత్రంపై నిజానికి ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. మరి “లైగర్” ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: అసలు కథ అని చెప్పడానికి సినిమాలో ఏమీ లేదు. విజయ్ దేవరకొండతో సినిమా మొదట్లో ఒక డైలాగ్ చెప్పించాడు పూరి “నాకు కథ చెప్పడం రాదు” అని. అది సినిమా విషయంలో అని మొదలైన 10 నిమిషాలకే అర్ధమైనప్పటికీ.. ఎక్కడో ఒక చోట కథ కనిపించకపోదా అని వెతికి వెతికి అలసి సొలసి, చతికిలపడడం తప్ప ఉపయోగం ఉండదు.

అయినప్పటికీ.. కథ అనే సబ్ హెడ్డింగ్ కి న్యాయం చేయాలి కాబట్టి, ఇక మొదలెడదాం.

తన తండ్రి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ లెవల్ ఫైనల్స్ లో ఓడిపోవడమే కాక.. నాకౌట్ లో చనిపోవడంతో.. ఆ ఛాంపియన్ షిప్ గెలిచి, తన తండ్రి కలను నెరవేర్చడం కోసం కరీంనగర్ నుండి అమ్మను, ఛాయ్ బండిని డి.సి.ఎంలో వేసుకొని ముంబై వెళ్తాడు లైగర్ (విజయ్ దేవరకొండ).

అతడి జర్నీ నేషనల్ లెవల్ నుండి ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లింది అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: విజయ్ దేవరకొండ నటుడిగా కంటే వ్యక్తిగా ఎక్కువ కష్టపడిన సినిమా “లైగర్”. సిక్స్ ప్యాక్ బాడీతో, ఫైటర్ బాడీ లాంగ్వేజ్ తో లుక్స్ పరంగా అలరించాడు. అయితే.. నత్తి పకోడీలా విజయ్ నటన & డైలాగ్ డెలివరీ చిరాకు పుట్టిస్తాయి. అసలే సినిమాలో కంటెంట్ లేదని బాధపడుతున్న ఆడియన్స్ కి విజయ్ నత్తి డైలాగులు ఇంకాస్త ఇబ్బందిపెడతాయి. విజయ్ చేసిన 10 సినిమాల్లో వరస్ట్ క్యారెక్టరైజేషన్ ఇదే అని చెప్పొచ్చు.

పాపం అనన్య పాండేను జనాలు ట్రోల్ చేసేదానికి, పూరి ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినదానికి భలే సరిపోయింది. మాములుగానే హీరోయిన్ క్యారెక్టర్స్ ను చాలా హేయంగా రాసే పూరీ, ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను మరింత జుగుప్సాకరంగా తీర్చిదిద్దాడు. దానికి తోడు అనన్య ఓవర్ యాక్టింగ్ ఎక్కడలేని విరక్తి తెప్పిస్తుంది. ఇక రమ్యకృష్ణ కూడా ఓవర్ యాక్టింగ్ తో విసుగు తెప్పించగలదు అని ప్రూవ్ చేశాడు పూరీ.

కాస్త రోనిత్ రాయ్ ఒక్కడే క్యారెక్టర్ కి న్యాయం చేశాడు ఎక్కడా అతి లేకుండా.

సాంకేతికవర్గం పనితీరు: ఇప్పటివరకూ విడుదలైన పూరి జన్నాధ్ సినిమాలన్నిట్లోకెల్లా వీకెస్ట్ సినిమా “లైగర్” అని చెప్పాలి. కథ-కథనం విషయంలో మాత్రమే కాదు, టెక్నికల్ గానూ ఇదే వీకెస్ట్ సినిమా. హిందీ డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి, విజయ్ & రమ్యకృష్ణ మినహా ఎవరికీ కనీసం లిప్ సింక్ లేదు. ఒక్క పాటలో కూడా నేటివిటీ కనిపించలేదు. ఫైట్స్ కూడా చాలా లేకిగా తీశారు. బేసిగ్గా పూరి ఒక్కోసారి ఎలాంటి సినిమాలు తీస్తాడో ఆయనకే అర్ధం కాదు.

“ఇస్మార్ట్ శంకర్”తో మంచి హిట్ కొట్టిన ఆయన, లైగర్ విషయంలో మాత్రం దారుణంగా బోల్తా కొట్టాడు. నిజానికి పూరి జగన్నాధ్ సినిమాల్లో ఆడియన్స్ ఎవరూ కథ, కథనం ఎక్స్ పెక్ట్ చేయరు. పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ & హీరోహీరోయిన్ల నడుమ రొమాన్స్ & విలన్ తో తలపడే సీన్స్ కోసమే సినిమా చూస్తారు. “లైగర్”లో ఇవేమీ లేవు, అసలు విలనే లేడు. కనీసం “జనగణమన”తో అయినా పూరి మళ్ళీ హిట్ కొడతాడని ఆశించడం తప్ప ఏమీ చేయలేం.

విశ్లేషణ: పాన్ ఇండియన్ హిట్ కొడదామని, 200 కోట్ల తర్వాతే కలెక్షన్లు లెక్కపెడదామనే విజయ్ దేవరకొండ ఊహ ఓ పగటి కలగా మిగిలిపోయింది. విజయ్ & పూరి జగన్నాధ్ డై-హార్డ్ ఫ్యాన్స్ కూడా థియేటర్లలో ఒక్కసారి కూడా పూర్తిగా చూడలేని సినిమాగా “లైగర్” నిలిచిపోయింది.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus