లిసా

అంజలి టైటిల్ పాత్రలో నటించిన సరికొత్త చిత్రం “లిసా”. తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి కొన్ని తెలుగు సన్నివేశాలు యాడ్ చేసి తెలుగు చిత్రంగా విడుదల చేశారు. మొట్టమొదటి 3డి హారర్ సినిమాగా ప్రచారం చేయబడ్డ ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: తన తల్లి రెండో పెళ్ళికి అమ్మమ్మ-తాతయ్యాలను ఒప్పించడం కోసం ఓ గ్రామంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఉన్న డిజే (మకరంద్ పాండే) మరియు అతడితో ఉన్న ముసలావీడను తన అమ్మమ్మ-తాతయ్యలుగా భావించి అక్కడ ఉండి తన తల్లి రెండో పెళ్ళికి ఒప్పించి తనతోపాటు ఊరికి తీసుకెళ్లాలనుకొంటుంది.

కానీ.. ఆ ఇంట్లో ఆమెకు చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఆఖరికి ఇన్నాళ్లుగా తాను అమ్మమ్మ-తాతయ్య అనుకొంటున్నవాళ్లు తన నిజమైన గ్రాండ్ పేరెంట్స్ కాదని తెలుసుకొంటుంది లిసా.

ఇంతకీ లిసా అమ్మమ్మ-తాతయ్యలుగా వాళ్ళు ఎందుకు నటిస్తున్నారు? దాని వెనుక గల కారణం ఏమిటి? అనేది “లిసా” సినిమా చూసి తెలుసుకోవాల్సిన అంశాలు.

నటీనటుల పనితీరు: అంజలికి ఈ తరహా హారర్ సినిమాల్లో, జంప్ స్కేర్ షాట్స్ కి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి ఇచ్చి బోర్ కొట్టిందో ఏమో కానీ.. ఈ సినిమాలో అమ్మడు అస్సలు యాక్టివ్ గా కనిపించదు. అలాగే.. ప్రొడక్షన్ వేల్యుస్ చాలా వీక్ గా ఉండడంతో గ్రాఫిక్స్ కానీ దెయ్యంగా అంజలి కనిపించే ఆ కొద్ది నిమిషాలు కానీ ఆమె ఆకట్టుకొనే విధంగా కనిపించదు.

బ్రహ్మానందాన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ వెండితెరపై చూడడం ఆనందంగానే ఉన్నప్పటికీ.. ఆ పాత్ర ద్వారా కామెడీ క్రియేట్ చేయలేకపోయాడు దర్శకుడు. అందులోనూ ఆయన క్యారెక్టర్ కు సరైన క్లారిటీ కానీ కంటిన్యూటీ కానీ ఉండదు. ఆ కారణంగా బ్రహ్మానందం ఉన్నప్పటికీ ఆ పాత్ర ద్వారా కామెడీ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. యోగిబాబు కామెడీ, పంచ్ లు చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. మకరంద్ పాండే మాత్రం తన పాత్రకు న్యాయం చేయడమే కాదు.. సినిమాకి ఏకైక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

సాంకేతికవర్గం పనితీరు: నిజానికి “లిసా” మూల కథలో మంచి మెసేజ్ తోపాటు జనాలని ఎంగేజ్ చేయగల దమ్ము కూడా ఉంది. కానీ.. ఈ థ్రిల్లర్ ను అనవసరంగా హారర్ సినిమాగా మార్చి ప్రేక్షకులను అనవసరంగా కన్ఫ్యూజ్ చేశారు. అసలు ఒక సాధారణ సినిమాను కష్టపడి 3డిలో ఎందుకు కన్వర్ట్ చేశారు అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం. ప్రొడక్షన్ వేల్యుస్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ చాలా యావరేజ్ గా ఉన్నాయి.

దర్శకుడు రాజు విశ్వనాథ్ రాసుకున్న మూల కథలో అందరి మనసుని హత్తుకొనే మంచి పాయింట్ ఉంది. కానీ.. ఆ కథను డీల్ చేసిన విధానం మాత్రం బాగోలేదు. ఆ కారణంగా “లిసా” ఎవరికీ రీచ్ అవ్వకుండా మిగిలిపోయింది.

విశ్లేషణ: సినిమా మొత్తంలో భయపెట్టే అంశాలు పక్కన పెడితే.. అలరించే అంశం ఒక్కటి కూడా లేని ఈ 3డి హారర్ థ్రిల్లర్ ను థియేటర్లో చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఉంది అనుకొంటే థియేటర్లకు వెళ్ళండి.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus