తింటే గారెలే తినాలి, చూస్తే తెలుగు పౌరాణిక సినిమాలే చూడాలి, అంటే అంతగా తెలుగువారు నిర్మించినట్టుగా పౌరాణిక సినిమాలు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ బహుశా తీయలేదేమో. సినిమా చూస్తున్నంత సేపూ, ప్రేక్షకుడు ఆ పాత్రనే చూస్తాడు తప్ప, అందులోని నటుడిని కాదు అన్నంతగా తీశారు తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈ పౌరాణిక సినిమాలు.
అయితే ఇదంతా ఎందుకు అంటే, ఇప్పుడు ప్రభాస్ కృతి సనన్ జంటగా ‘ఆదిపురుష్’ అనే సినిమా రామాయణం ఆధారంగా ఒక యానిమేషన్ సినిమా వస్తోంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీత గా కృతి సనన్ వేశారు. ఈరోజు అంటే శనివారం, కృతి సనన్ సీత పాత్ర ఫోటో విడుదల చేశారు. తెలుగు సినిమాల్లో సీత గా వేసిన నటీమణులను చూద్దాం.
గీతాంజలి
ఎన్.టి. రామారావు గారు స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా ‘సీతారామ కళ్యాణం’. ఇందులో అతను చేసిన రావణబ్రహ్మ పాత్ర అజరామరం, అనన్య సామాన్యం, ఆయనొక్కడే ఆలా చెయ్యగలడు, వేరేవాళ్లు చెయ్యలేరు అన్నంతగా ఉంటుంది అతని చేసిన నటన. రామారావు తన సినిమాలో సీతగా గీతాంజలి ని తీసుకున్నారు. హరనాథ్ రాముడుగా వేసాడు. గీతాంజలి ఎక్కడ కనపడినా రామారావు గారు సీతమ్మా అని పిలుస్తూ ఉండేవారట. అంటే ఆమె ఎంత అద్భుతంగా ఆ పాత్రలో మెప్పించిందో చూడండి. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. ఇందులోనే కాంతారావు నారదుడుగా అపూర్వ నటన ప్రదర్శించేడు. ఇది 1961 లో విడుదల అయింది.
అంజలీ దేవి
సీత అనగానే, మనకి టక్కున గుర్తొచ్చేది ‘లవకుశ’ సినిమాలో రాముడు పాత్రలో, అచ్చం అలాగే కనిపించే ఆజానుబాహుడు ఎన్టీఆర్ పక్కన వేసిన అంజలీ దేవి గుర్తుకు వస్తుంది. అసలు ఆ పాత్రకు వన్నె తెచ్చిన నటి అంజలి దేవి ‘లవకుశ’ లో జీవించింది. అందుకుగాను ఆమెకి అవార్డు కూడా లభించింది. చూస్తున్న ప్రేక్షకుడికి నిజంగా సీతమ్మవారి కిందకి దిగి వచ్చి ఆలా కనిపిస్తున్నారా అన్నంతగా అంజలి దేవి నటించింది. ఇది 1963 లో వచ్చిన చిత్రం. ఈ సినిమాలో పాటలు, అప్పటి నుండి ఇప్పటి వరకు అజరామరంగా ప్రతి దగ్గర వినిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాకి సి. పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు.
చంద్రకళ
దర్శకుడు బాపు నిర్మించిన తోలి పౌరాణిక సినిమా ‘సంపూర్ణ రామాయణం’ ఇది 1972లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి గ్రామాల నుండి ప్రజలు బళ్ళు మీద వచ్చి చూసేవారు. ఈ సినిమా విడుదల అయిన చోట ఒక పెద్ద జాతరలా ఉండేది అప్పట్లో. ఈ సినిమాలో శోభను బాబు రాముడుగా నటించగా, సీతగా చంద్రకళ వేసింది. ఆ అమ్మాయి ఆ పాత్రలో ఒదిగిపోయింది, అంతలా చేసింది సీతగా. ఈ సినిమా రామాయణం ఆధారంగా తీసినదే. ఇందులో రావణాసురిడిగా ఎస్.వి. రంగారావు నటన అద్వితీయం.
జయప్రద
బాపు గారు మరో సినిమా ‘సీతా కళ్యాణం’ అని, ఒక్క సీతారాముల కళ్యాణం వరకు మాత్రం ఈ సినిమాలో కథ. ఇందులో రాముడిగా రవికుమార్ అనే కొత్త అబ్బాయి వెయ్యగా, సీతగా ప్రముఖ నటి జయప్రద వేసింది. ఇది 1976లో విడుదల అయింది. అప్పటికి జయప్రద ఇంకా కొత్తమ్మాయే. కానీ ఇందులో సీతగా మాత్రం బాపుగారి బొమ్మలా ఎంతో చక్కగా చేసి, అభినయించింది. సీతమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించేంత బాగా చేసింది.
సంగీత
రామారావు గారు మళ్ళీ ‘శ్రీరామ పట్టాభిషేకం’ అని ఇంకో పౌరాణిక సినిమా దర్శకత్వం, నిర్మాతగా రామాయణం ఆధారంగా తీసారు. ఇందులో అయన రాముడిగా, రావణుడిగా రెండు పాత్రల్లో కనిపించగా, సీత పాత్ర సంగీత అనే ఆమె చేత చేయించారు. సంగీత కూడా చక్కని అభినయం చేసి చూపించింది. ఇది 1978లో విడుదల అయింది.
నయనతార
బాపుగారి దర్శకత్వం నుండి జారిపడిన మరో పౌరాణికం చిత్రం ‘శ్రీరామరాజ్యం’ సినిమాను బాపుగారు తీశారు. ఇది పాత ‘లవకుశ’ సినిమాకి రీమేక్ లాంటింది. ఇందులో రాముడిగా నందమూరి బాలకృష్ణ వెయ్యగా, సీతగా నయనతార చేసింది. అప్పుడు చాలామంది విమర్శిచారు నయనతార సీత వెయ్యటం ఏంటి అనీ, ఎందుకంటే అప్పటి వరకు నయనతారని గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువ చూసారు, అలాంటిది ఆమెని సీత పాత్రకి బాపు ఎలా తీసుకున్నారు అని. అయితే అందరి అనుమానాలనూ పటాపంచలు చేస్తూ నయనతార చాలా చక్కని ప్రతిభతో సీతగా చేసి చూపించింది. సినిమా సరిగ్గా నడవలేదు కానీ, సీత పాత్ర వేసిన నయనతారకు మంచి పేరు వచ్చింది. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు వాల్మీకి పాత్ర వెయ్యడం ఆసక్తికరం. ఇది 2011 లో విడుదల అయింది.
ఆ తరువాత కొన్ని సినిమాల్లో (Sita Role) సీతగా చిన్న పాత్రల్లో కొంతమంది కనిపించారు. నాగార్జున నటించిన ‘శ్రీరామదాసు’ సినిమాలో అర్చన లేదా వేదా సీత గా కనిపిస్తుంది. ‘దేవుళ్ళు’ సినిమాలో లయ కూడా సీతగా ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది. ఇలా చాలామంది సీత పాత్రల్లో వేసి మెప్పించారు. తెలుగు పౌరాణిక సినిమాల్లో సీత పాత్ర అనగానే చూస్తున్న ప్రేక్షకుడికి కూడా ఒకరకమైన భక్తిభావం వచ్చేసేది, అంతలా మన దర్శకులు, నటీనటులు తీశారు, మెప్పించారు. మరి ఇప్పుడు కృతి సనన్ చేసిన సీత దక్షిణాది ప్రేక్షకులకు మెప్పించగలదా..అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.