2020 అంటే అందరికీ కరోనా మాత్రం గుర్తొస్తుంది కానీ.. మా సినిమా వాళ్లకి 2020లో కూడా సంతోషాన్నిచ్చిన సినిమాలు చాలా ఉన్నాయండోయ్. అయితే.. వీటిలో కొన్ని థియేటర్లలో చూస్తే.. కొన్ని మాత్రం ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసాం. కలెక్షన్స్, రికార్డ్స్ లాంటివి పరిధిలోకి తీసుకోకుండా కేవలం జనాలను అలరించిన సినిమాలను మాత్రమే ఈ లిస్ట్ లోకి తీసుకోబడింది. కావున.. వేరే ఏదైనా సినిమా మిస్ అయితే తిట్టుకోకుండా.. కామెంట్ బాక్స్ లో సినిమా పేరు, ఆ సినిమాను బెస్ట్ అని ఎందుకు అనుకొంటున్నారు అనే కారణం పోస్ట్ చేయండి. మీ కారణం మాకు నచ్చితే.. తప్పకుండా ఆ చిత్రాన్ని లిస్ట్ లో చేర్చుతాం. సో, 2020లో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏవి, ఎందుకు, ఎలా? అనే చూసి తెలుసుకొందాం.
1.సరిలేరు నీకెవ్వరు
ఈ సినిమా నచ్చినవాళ్లకంటే.. నచ్చనివాళ్ళ సంఖ్య కాస్త ఎక్కువ. ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ ను దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆ నచ్చకపోవడానికి కారణం. నచ్చడానికి మాత్రం ఏకైక కారణం మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ “ఖలేజా”ను గుర్తు చేస్తుంది. అలాగే.. మైండ్ బ్లాక్ లో బాబు స్టెప్పులు అదిరిపోతాయ్ అంతే. అప్పటివరకు మహేష్ బాబుకి డ్యాన్స్ రాదురా అని ఎగతాళి చేసినోళ్లందరికీ చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు మహేష్.
2. అల వైకుంఠపురములో
ఫ్యాన్ వార్స్ కారణంగా కొంతమంది హేటర్స్ ఈ సినిమాకి ఏర్పడ్డారు కానీ.. అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న సినిమా “అల వైకుంఠపురములో”. కథ-కథనం రొటీన్ అయినప్పటికీ.. త్రివిక్రమ్ వాటిని డిజైన్ చేసిన తీరు, రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని అలరించిన విధానం మనసుల్ని గెలుచుకుంది. అల్లు అర్జున్ లో ఇంత అద్భుతమైన నటుడు ఉన్నాడా అని ముక్కున వేలేసుకునేలా చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. పూజా హెగ్డే గ్లామర్, తమన్ సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 2020గా నిలిపాయి.
3.అశ్వద్ధామ
నాగశౌర్య నటుడిగానే కాక రచయితగాను ప్రయోగం చేసిన సినిమా ఇది. సిస్టర్ సెంటిమెంట్, క్రేజీ విలన్, గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు వంటివి పుష్కలంగా మేళవించిన ఈ చిత్రం ఓ మోస్తరుగానే ఆకట్టుకున్నప్పటికీ.. బెస్ట్ మూవీ లిస్ట్ లో చేరడానికి కారణం మాత్రం కొత్తదనం. కొత్త కథ కాదు, కథనం బాగుంటుంది. చూస్తున్నంతసేపు మనసులో చిన్న భయం కలుగుతుంది. క్లైమాక్స్ ఇంకాస్త నీట్ గా వర్కవుట్ చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది కూడా.
4.జాను
రీమేక్ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎంతోమంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్సే ఈ రీమేకుల వల్ల ప్రాభవం కోల్పోయారు. అలాంటిది హైద్రాబాద్ లో విడుదలవ్వలేదని సినిమా పిచ్చోళ్ళు బెంగుళూరు, చెన్నై వెళ్లి మరీ థియేటర్లలో చూసేలా చేసిన సినిమా “96”. త్రిష, విజయ్ సేతుపతి జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో సమంత, శర్వానంద్ జంటగా “జాను” అనే పేరుతొ రీమేక్ చేశారు. దిల్ రాజు నిర్మించడంతో ఈ సినిమాకి కావాలసినంత బజ్ కూడా వచ్చింది. అయితే.. శర్వానంద్ కానీ, సమంత కానీ ఇదివరకే అలాంటి సినిమాలు చేసి ఉండడంతో తెలుగులో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. .అయినప్పటికీ.. సినిమాలోని నిజాయితీ ఈ బెస్ట్ లిస్ట్ లో జాయిన్ అయ్యేలా చేసింది.
5.భీష్మ
అప్పటికి నితిన్ మార్కెట్ మళ్ళీ డౌన్ అవుతూ వస్తోంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమయంలో నితిన్ కెరీర్ ను కాపాడడమే కాక ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సినిమా “భీష్మ”. అక్కడక్కడా కొన్ని కుళ్ళు జోకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా మాత్రం ప్రేక్షకలోకాన్ని గట్టిగానే ఆకట్టుకుందని చెప్పాలి. నితిన్ కెరీర్ పరంగానూ ఈ సినిమా కలెక్షన్స్ అదుర్స్.
6.హిట్
సినిమా పేరే హిట్ ఏంట్రా అని ఆలోజింపజేసిన సినిమా “హిట్”. నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం శైలేష్ కొలను అనే యువ ప్రతిభాశాలిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. విడుదలకు ముందు అంత బజ్ లేకపోయినా.. రివ్యూస్ & పాజిటివ్ మౌత్ టాక్ వల్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇది. పకడ్బంధీగా కథ రాసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేందుకు చక్కని ఉదాహరణ ఈ చిత్రం.
7.పలాస 1978
జాతి, కులం అనేవి మనిషిలోని మృగాన్ని ఎలా తట్టి లేపుతాయి అనేది చాలా స్పష్టంగా చూపించిన సినిమా “పలాస”. హీరో కాస్త మైనస్ అయ్యాడు కానీ.. దర్శకుడు సినిమా ద్వారా చెప్పాలనుకున్న నీతి, సపోర్టింగ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక నక్కిలీసు గొలుసు పాట గురించి ఏం చెప్పాలి.
8.మిడిల్ క్లాస్ మెలోడీస్
మలయాళ, మరాఠీ సినిమాలు చూసి.. ఇలా సున్నితమైన, సింపుల్ కథలతో మన తెలుగులో ఎందుకు రావు అని బాధపడిన ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమానిని సంతుష్టపరిచిన చిత్రం “మిడిల్ క్లాస్ మెలోడీస్”. చాలా చిన్న కథ, కానీ కథనంలో మనం లీనమైపోతాం. ఇక కొండల్ రావ్, నాగేశ్వరరావుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాక్ డౌన్ వల్ల థియేటర్లలో విడుదలవ్వలేకపోయింది కానీ.. థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే “పెళ్లి చూపులు”కు మించిన విజయాన్ని అందుకొనేది.