ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన పేరిట అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచమైన పవన్ టాప్ స్టార్ గా ఎదిగి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో వీరాభిమానులు కలిగిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్.

1996లో విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచమైన పవన్, కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ ఆయన చిత్రాలు కొల్లగొట్టాయి. దాదాపు 24ఏళ్ల కెరీర్ లో పవన్ చేసింది కేవలం 25 సినిమాలు మాత్రమే. ఎంతటి స్టార్ డమ్ ఉన్నా ఆచితూచి సినిమాలు చేసే పవన్ అనేక సినిమాలను కొన్ని కారణాల వలన వదిలివేశారు. ఆయన వదులుకున్న సినిమాలతో కొందరు హీరోలు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.అలాగే కొన్ని సినిమాలు మధ్యలో, మరికొన్ని ప్రకటన తరువాత ఆగిపోవడం జరిగింది. పవన్ పుట్టినరోజు సంధర్భంగా పవన్ కెరీర్ లో వదులుకొన్న కొన్ని సినిమాలు మీ కోసం..

1. చెప్పాలనివుంది

2000లో తరుణ్, రిచా హీరో హీరోయిన్స్ గా దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం నువ్వే కావాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పెట్టుబడికి 20 రెట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీని పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు. చెప్పాలనివుంది అనే టైటిల్ తో మూవీ ప్రకటించడం కూడా జరిగింది. అమీషా పటేల్ హీరోయిన్ గా నటించాల్సివుంది. కారణం ఏదైనా ఈ ప్రాజెక్ట్ నుండి పవన్ తప్పుకోవడంతో తరుణ్ కి గ్రేట్ ఎంట్రీ లభించింది.

2. సత్యాగ్రహి

ఓ పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో సత్యాగ్రహి అనే చిత్రాన్ని పవన్ తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ టైటిల్ ప్రకటనతోనే సినిమాకి భారీ హైప్ వచ్చి చేరింది. ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సత్యాగ్రహి సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించి, నటించాలని పవన్ భావించారు. అప్పటికే తన దర్శకత్వంలో వచ్చిన జానీ ఘోర పరాజయం పొందడంతో పవన్ ఆ ఆలోచన విరమించుకున్నారు.

3. దేశి

దేశి అనే మరో చిత్రాన్ని కూడా దేశభక్తి కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ తెరకెక్కించాలనుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. కారణం ఏదైనా పవన్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు.

4. ప్రిన్స్ ఆఫ్ పీస్

వైవిధ్యంగా ఆలోచించే పవన్ కొన్ని డిఫరెంట్ సబ్జక్ట్స్ కూడా ఎంచుకున్నారు. వాటిలో ప్రిన్స్ ఆఫ్ పీస్ కూడా ఒకటి. ఈ చిత్రంలో పవన్ లార్డ్ జీసస్ పాత్ర చేయాల్సివుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాల్సిన ఈ మూవీ మధ్యలో ఆగిపోయింది. 2010లో జెరోసలేం లో ఓ షెడ్యూల్ కూడా మొదలుపెట్టిన తరువాత మూవీ ఆగిపోయింది.

5. కోబలి

పవన్ ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ లో కోబలి ఒకటి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కాంబినేషన్ లో సోసియో ఫాంటసీ మూవీగా కోబలి తెరకెక్కించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అప్పటిలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బడ్జెట్ సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలైనా కావచ్చు మూవీ మాత్రం పట్టాలెక్కలేదు.

6. పవన్ – లారెన్స్

నటుడు దర్శకుడు మరియు కొరియా గ్రాఫర్ లారెన్స్ కూడా పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ ప్రకటించడం జరిగింది. భారీ బడ్జెట్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ వీరి కాంబినేషన్ లో రానుందని ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సైతం ముందుకు వెళ్ళలేదు.

7. పవన్- వివి వినాయక్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ పవన్ తో మూవీ చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. అత్తారింటికి దారేది చిత్రం తరువాత వివి వినాయక్ తో మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం ఛాల్చలేదు.

8. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బెస్ట్ మూవీస్ లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఒకటి. 2003లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు హీరో రవితేజ స్టార్ హీరోగా ఎదగడానికి పునాది వేసింది. నిజానికి ఈ స్క్రిప్ట్ పవన్ కోసం పూరి రాసుకున్నారు. బద్రి సినిమా తరువాత వీరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. దానితో ఆయన ఈ ప్రాజెక్ట్ కి హీరోగా రవితేజను ఎంచుకున్నారు. పవన్ ఈ మూవీ చేస్తే దాని ఫలితం మరో స్థాయిలో ఉండేది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus