ఇండియన్ సినిమాలో సినిమాను హీరో అనుకుంటే.. సినిమాటిక్ యూనివర్స్‌ని స్టార్ హీరో అనొచ్చు. ఆ సూపర్ హీరోలకే సూపర్ హీరో ‘ఎల్‌సీయూ’. అవును లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌కి ఇప్పుడు అంతటి ఆదరణ ఉంది. అందులో ప్రస్తుతం ఏ సినిమా కూడా తెరకెక్కకపోతున్నా.. క్రేజ్ మాత్రం అలానే ఉంది. దానికి కారణం రజనీకాంత్ – లోకేశ్ కనగరాజ్‌ల ‘కూలీ’ సినిమా అందులో భాగమే అనే వార్తలు వస్తుండటమే. ఆ సంగతి తేలలేదు కానీ.. అసలు ఈ యూనివర్స్‌కి కీలక పాత్ర, అసలు ఈ యూనివర్స్ పుట్టడానికి కారణమైన పాత్ర ఏంటో లోకేశ్ చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్ కీలక పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్’ సినిమాతో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది. అయితే ‘విక్రమ్’ కథ కమల్ హాసన్‌కు వినిపించినప్పుడు ఈ ఆలోచన లేదట. అయితే అందులో ఒక పాత్ర ‘ఖైదీ’లో ఇన్‌స్పెక్టర్ బిజోయ్ (నరేన్)ను పోలి ఉంటుందనిపించిందట. దీంతో ఆ పాత్రను కూడా నరేన్‌తోనే చేయించాలని అనుకున్నారట లోకేశ్ కనగరాజ్. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ పాత్రను క్రాస్ ఓవర్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేశారట.
తన ఆలోచనను అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర ప్రస్తావిస్తే వివిధ రకాల స్పందనలు వచ్చాయట. దాంతోపాటు ఆ బిజోయ్ పాత్ర మాత్రమే కాకుండా మరికొన్ని పాత్రలను క్రాస్ ఓవర్ చేయాలన్న ఆలోచన వచ్చిందట. అలా రెండు సినిమాలు కలసి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ఏర్పడింది అని లోకేశ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు బిజోయ్ పాత్ర ‘కూలీ’లో ఉంటుందా లేదా అనే ప్రశ్న మొదలైంది. అదే జరిగితే ‘కూలీ’ కూడా ఎల్‌సీయూలో భాగం అవుతుంది. మరి లోకేశ్ మనసులో ఏముందో చూడాలి.
ఇక ‘కూలీ’ విషయానికొస్తే.. రజనీకాంత్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సౌబిన్ సాహిర్ తదితరులు ముఖ్య పాత్రధారులు.. ఆగస్టు 14న సినిమాను విడుదల చేస్తున్నారు.