లవర్స్ క్లబ్

  • November 17, 2017 / 12:55 PM IST

టెక్నాలజీలో రోజుకో కొత్త విషయం/వస్తువు ఆవిర్భావం చెందుతున్నట్లే.. ఫిలిమ్ మేకింగ్ లోనూ సరికొత్త పద్ధతులు వస్తూనే ఉన్నాయి. అలా కేవలం “ఐఫోన్ 6s plus”ను వినియోగించి తెరకెక్కించిన చిత్రం “లవర్స్ క్లబ్”. కొత్తవాళ్లతో రూపొందిన ఈ ప్రయోగాత్మక చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ కొత్త టెక్నాలజీతో రూపొందిన చిత్రం ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : రిషి (అనీష చంద్ర) పోలీస్ ఆఫీసర్ అయిన తన తండ్రి ఓ ప్రేమజంటను కలపడం వల్ల ప్రాణాలు కోల్పోయాడన్న కోపంతో.. “లవర్స్ క్లబ్” అనే సంస్థను స్థాపించి, మనస్ఫూర్తిగా ప్రేమించుకొని డబ్బు లేదా పెద్దల సమస్యల కారణంగా పెళ్లి చేసుకోలేకపోతున్నవారికి అండగా నిలుస్తుంటాడు. అతడి స్నేహబృందం కూడా రిషికి సహాయపడుతుంటారు. కట్ చేస్తే.. కొత్తగా పెళ్లై రిషి ఇంట్లో అద్దెకు దిగుతుంది గీత (పావని). ఆమెను చూడగానే మనసుపడతారు రిషి, ఆమెకు పెళ్లైనా సరే ఆమెనే పెళ్లాడాలనుకొంటాడు. ఈలోపు గీత గురించి ఒక నమ్మలేని నిజం తెలుస్తుంది. మళ్ళీ కట్ చేస్తే.. లవర్స్ క్లబ్ ఫేస్ బుక్ పేజ్ లో రాజు అనే కుర్రాడు ప్రేమ వ్యవహారం కారణంగా తాను ప్రాణాలు కోల్పోబోతున్నాని వీడియో పోస్ట్ చేస్తాడు. అతడ్ని కాపాడి, అతడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే ప్రయత్నంలో రిషికి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. అదే “లవర్స్ క్లబ్” కథాంశం.

నటీనటుల పనితీరు : నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే. ఏవో రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ కథానాయకి పావని మినహా ఏ ఒక్కరికీ సరైన గుర్తింపు లేదు. మిగతా నటీనటులందరూ పర్లేదు అనిపించుకోగా.. పావని మాత్రం అంగాంగ ప్రదర్శనతో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పిస్తుంది. లెక్కకి మిక్కిలి ఫేస్ బుక్ ఆర్టిస్ట్స్ ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరూ నటనతో అలరించలేకపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : ఇదివరకు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను “iphone 6″తో ఒక టెస్ట్ షూట్ చేశాడు. ఆ విషయాన్ని ప్రేరణగా తీసుకొని “Iphone 6s”తో మొత్తం సినిమా తీసేశారు “లవర్స్ క్లబ్” చిత్ర బృందం. యాపిల్ స్టోర్ లో లభ్యమవుతున్న కొన్ని వీడియో యాప్స్ ను యూటిలైజ్ చేసుకొని సినిమాని బాగానే తెరకెక్కించారు.

టెక్నాలజీ బాగానే వాడుకొన్నారు కానీ.. కథ-కథనాల విషయంలో కనీస స్థాయి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అందువల్ల రెగ్యులర్ మూవీ గోయర్స్ ను ఆకట్టుకొనే అంశం ఒక్కటీ సినిమాలో కనిపించదు. ఒక ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన “లవర్స్ క్లబ్”ను ఇంతకుమించి విమర్శించడం సరికాదు కాబట్టి.. ఇంతటితో ఈ సమీక్షను ఆపుతూ.. ఇకపై ప్రయోగాలు చేసేప్పుడు కేవలం టెక్నాలజీని మాత్రమే కాక కాస్త కథ-కథనాల గురించి కూడా పట్టించుకొంటే అద్భుతాలు సృష్టించవచ్చు అనే విషయాన్ని “లవర్స్ క్లబ్” బృందం గమనించాల్సిందిగా మనవి.

రేటింగ్ : ఇదొక ప్రయోగాత్మక చిత్రం, అందువల్ల రేటింగ్ ఇవ్వడం లేదు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus