ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా మంచి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసి, ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్న దర్శకుడు మురుగదాస్. ఆయన తాజా ప్రయత్నం “మదరాసి” (Madharaasi). శివకార్తికేయన్, రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మీద ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి దర్శకుడిగా మురుగదాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: ఆపదలో ఉన్న ఎవర్ని చూసినా తన సొంత మనుషులే అనుకుని సహాయం చేసే ఒక వింత రోగం ఉన్న వ్యక్తి రఘు (శివకార్తికేయన్). ఆ రోగం పేరు డెల్యూషనల్ సిండ్రోమ్. రఘులో ఆ సిండ్రోమ్ నచ్చి అతడ్ని ప్రేమిస్తుంది మాలతి (రుక్మిణి వసంత్).
ఆ సిండ్రోమ్ కారణంగా ఓ పెద్ద సిండికేట్ వార్ లో చిక్కుకుంటాడు రఘు.
ఇంతకీ ఆ సిండికేట్ ఏమిటి? దాన్నుంచి రఘు ఎలా బయటపడ్డాడు? వాళ్లని ఎలా ఎదిరించాడు? అనేది “మదరాసి” కథాంశం.
నటీనటుల పనితీరు: శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. అతడి బాడీ లాంగ్వేజ్ & డైలాగ్ డెలివరీ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ లో అతడి పెర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే.. మామూలు పరిస్థితికి, ఊహించునే స్థితికి అతడు చూపిన వైవిధ్యం కూడా బాగుంది.
రుక్మిణి వసంత్ నటిగా ఎక్కువ కష్టపడిన సినిమా ఇదేనేమో. పాపం “సప్తసాగరాలు దాటి”కి మించిన కష్టాలు ఈ సినిమాలో చవిచూసింది.
మలయాళ నటుడు బిజు మీనన్ క్యారెక్టర్ బాగుంది కానీ.. రొటీన్ గా ఉండడం అనేది మైనస్ అని చెప్పాలి.
విద్యుత్ నటుడిగా కంటే యాక్షన్ బ్లాక్ తో ఎక్కువగా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్నీ చాలా రెగ్యులర్ గా ఉండడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదు.
సాంకేతికవర్గం పనితీరు: అసలు ప్రతి సినిమాని తన సంగీతంతో వీరలేవల్లో ఎలివేట్ చేసే అనిరుధ్ ఈ సినిమాకి మైనస్ గా నిలిచాడు. ఒక్క పాట కూడా బాగోలేదు. నేపథ్య సంగీతం కూడా అక్కడక్కడా బాగుంది తప్పితే, సినిమాకి కావాల్సిన ఎలివేషన్ ఇవ్వలేకపోయింది.
సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం అదిరింది. ముఖ్యంగా లైటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా టాప్ క్లాస్ అనే చెప్పాలి.
వీటన్నిటికీ మించి యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో శివకార్తికేయన్-విద్యుత్ ల మధ్య జరిగే పోరాటం చాలా నేచురల్ గా ఉంది. బుల్లెట్ షూట్ ఒక్కటే సింక్ లో లేదు కానీ, మిగతా యాక్షన్ బ్లాక్స్ అన్నీ మంచి హై ఇచ్చాయి.
దర్శకుడు మురుగదాస్ ఇంకా “తుపాకీ” ఫీవర్ నుంచి బయటికి రాలేదేమో అనిపించింది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేసిన విధానం చాలా చోట్ల విజయ్ ను పోలి ఉంటుంది. మధ్యమధ్యలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ.. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే చాలా వీక్ అనే చెప్పాలి. అసలు కొన్ని యాక్షన్ సీన్స్ ఎందుకు ఉన్నాయో తెలియదు. సిటీ నడిబొడ్డున ఉన్న ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ మీద రౌడీ గ్యాంగ్ దాడి చేసే సన్నివేశం లాజికల్ గా పక్కన పెట్టినా, కామన్ సెన్స్ కూడా కనిపించలేదు. హీరోకి సిండ్రోమ్, ఆ సిండ్రోమ్ కి సింక్ అయ్యే సిండికేట్, ఆ సిండికేట్ తో సెట్ అవ్వని హీరోయిన్ క్యారెక్టర్.. ఇలా సినిమా అంతా సంబంధం లేని పాత్రలు, సన్నివేశాలతో చుట్టేశాడు మురుగదాస్. ఆ కారణంగా మురుగదాస్ మరోసారి నిరాశపరిచాడని చెప్పాలి.
విశ్లేషణ: యాక్షన్ సినిమాల్లో లాజిక్కులు వెతకడం అనేది కరెక్ట్ కాదు కానీ.. కనీస స్థాయి మ్యాజికల్ స్క్రీన్ ప్లే లోపించినప్పుడు ఈ సిండ్రోమ్ లు, సిండికేట్ లు చాలా ఇబ్బందిపెడతాయి. శివకార్తికేయన్ నటన, అతడు చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నా.. అవి ఎందుకు అనే ప్రశ్నకి సరైన సమాధానం లేకపోవడంతో.. సినిమా చూస్తున్నంతసేపు చాలా “అసలు ఎందుకిలా అవుతుంది?” అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. మురుగదాస్ ఈ బ్యాక్ అని తమిళనాట వినిపిస్తున్న టాక్ అబద్ధమని స్పష్టమైంది. తన తదుపరి సినిమాతోనైనా మురుగదాస్ వింత రోగాల మీద ఆధారపడకుండా తన మార్క్ మంచి స్క్రీన్ ప్లేతో మంచి సినిమా తీస్తాడని ఆశపడడం తప్ప ఏమీ చేయలేం.
ఫోకస్ పాయింట్: మళ్లీ ముంచిన మురుగ!
రేటింగ్: 1.5/5