‘మధుర వైన్స్’… టైటిల్ చాలా క్యాచీగా ఉండడం వల్ల చాల కాలం నుండీ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా యూత్ లో ఈ చిత్రం పై మొదటి నుండీ ఆసక్తి నెలకొందనే చెప్పాలి.టీజర్, ట్రైలర్ వంటివి కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమా పై హైప్ కూడా పెరిగింది. నిజానికి 2018 చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.. తక్కువ టైంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ… మధ్యలో కరోనా వంటి అవాంతరాలు రావడం వలన పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది.మరి ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
కథ : అజయ్(సన్నీ నవీన్) ప్రేమించిన అమ్మాయి దూరమైపోవడంతో మద్యానికి బానిసైపోతాడు. అతని తండ్రికి వినికిడి సమస్యతో పాటు మాటలు కూడా రాకపోవడంతో అజయ్ ను పట్టించుకునే వాళ్ళే ఉండరు. అయితే ఇతనికి మధుర వైన్స్… ఓనర్ ఆనంద్ రావు(సమ్మోహిత్ తూములూరి) తో పరిచయం ఏర్పడుతుంది. అనంతరం ఇద్దరూ సన్నిహితులు అవుతారు. మరోపక్క అజయ్ ను అంజలి(సీమా చౌదరి) అనే అమ్మాయి ప్రేమిస్తుంది.
అంజలికి తాగుబోతులంటే నచ్చకపోయినా అజయ్ నిజాయితీ నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. ఓ పక్క వైన్ షాప్ ఓనర్ మరో పక్క అంజలి.. ఇలా రెండు వైపులా అజయ్ కి కొత్త ఆనందాల లభిస్తాయి. అయితే అనుకోని విధంగా మళ్ళీ అజయ్ కు సమస్యలు తలెత్తుతాయి. అది ఎవరి వల్ల? చివరికి అంజలి, అజయ్ లు ఒక్కటవుతారా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: అజయ్ పాత్రని సన్నీ చాలా ఈజ్ తో పోషించాడు. మద్యానికి బానిసైపోయిన యువకుడిగా ఎమోషనల్ సన్నివేశాల్లో అతను మంచి నటన కనపరిచాడు. కానీ అతని సంఘర్షణ ఏంటన్నది ప్రేక్షకులకి అర్ధమయ్యే విధంగా తీర్చిదిద్దలేదు.సీమా చౌదరి లుక్స్ బాగున్నాయి.కానీ నటనలో ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. సమ్మోహిత్ తుమ్మలూరి నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.అతని హావభావాలు మనకి మరో రావు రమేష్ దొరికాడు అనే ఫీలింగ్ ను కలిగిస్తాయి.లీలా వెంకటేష్, అల్లు రమేష్, హరీష్ రోషన్ వంటి వారి పాత్రలు ఓకే అనిపిస్తాయి.. కానీ ఎక్కువగా గుర్తుండవు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు జయకిషోర్.బి రాసుకున్న కథ మరియు మరియు మాటలు బాగున్నాయి. యూత్ కి మరీ ముఖ్యంగా మందుబాబులకి ఇతను రాసుకున్న డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. కానీ లాజిక్ పరంగా, టేకింగ్ పరంగా అతను పెట్టిన ఎఫర్ట్ సరిపోలేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు కొంత ఓకే అయినప్పటికీ.. సెకండ్ హాఫ్ అయితే చాలా డల్ గా బోరింగ్ గా సాగుతుంది.
కార్తిక్, జయ్ క్రిష్ ల సంగీతం ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో చాలా మైనస్ లు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కొంతవరకు ఓకే అయినప్పటికీ.. కొన్ని కొన్ని సీన్లలో మాత్రం షార్ట్ ఫిలిం చూస్తున్నామా? అనే అనుమానాలను రేకెత్తించే విధంగా ఉంది.
విశ్లేషణ: మందు సిట్టింగ్లలో మందు తాగని వాళ్ళు కుర్చున్నారు అంటే… అది కచ్చితంగా స్టఫ్ కోసమే అవుతుంది. సరైన స్టఫ్ కనుక అక్కడ లేకపోతే ఆ మందు తాగేవాళ్ళు చెప్పే సోది వినలేరు కదా.! సరిగ్గా ‘మధుర వైన్స్’ సినిమా కూడా అంతే.