తెలుగు సినిమా పరిధి విస్తరించింది. తెలుగు సినీ ప్రేక్షకుల ఆలోచన మారింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ.. సో సో గా సినిమా తీస్తే.. ఆ సినిమాని రెండో రోజే వెనక్కి పంపిచేస్తున్నారు. అందుకే హడావిడిగా సినిమాలు చేయడం కన్నా.. అలోచించి సినిమా చేయడం మేలని స్టార్ హీరోలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టాప్ హీరో 25 సినిమాలు పూర్తి చేయడమే పెద్ద రికార్డ్ గా మారిపోయింది. దీంతో ఒక హీరోకి సంబంధించి 25వ సినిమా అంటే ఆమూవీ పై విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే అంచనాలను అందుకోవడంలో టాప్ హీరోల 25వ సినిమా తరుచూ బోల్తా పడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి “అజ్ఞాతవాసి” 25వ సినిమా. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అదేవిధంగా యంగ్ హీరో నితిన్ నటించిన 25వ సినిమా “ఛల్ మోహన్ రంగా” కూడ ఫ్లాప్ అయింది. ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘పందెం కోడి 2’ విశాల్ కెరియర్ కు సంబంధించి 25వ సినిమా.
ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. వీటిని పరిశీలించిన సినీ విశ్లేషకులు టాప్ హీరోలకు 25వ సినిమా కలిసిరావడం లేదని చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సెంటిమెంట్ ని నమ్ముతున్నారు. ఇదే మహర్షి చిత్ర యూనిట్ సభ్యులను ఆందోళన కలిగిస్తోంది. మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలవాల్సిన ఈ మూవీ కూడా అపజయం పాలవుతుందా? అని కంగారుపడుతున్నారు. డైరక్టర్ వంశీ పైడిపల్లి మాత్రం ఆ సెంటిమెంట్స్ తమ సినిమాని ఏమీ చేయలేవని ధీమాగా ఉన్నారు. మహేష్ అంటే గిట్టని వాళ్ళే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపడేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.