మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదలవుతుంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రంలో మహేష్ ను మూడు షేడ్స్ లో చూపించాడు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఈ ప్రమోషన్లలో భాగంగా ‘మహర్షి’ చిత్రంతో పాటూ తన పాతిక సినిమాల జర్నీ గురించి కూడా మహేష్ చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా మహేష్ తన తొలి చిత్రం అనుభవాల్ని పంచుకున్నాడు. ‘రాజకుమారుడు’ సినిమా కథ నేరేషన్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు తన పై సీరియస్ అయిన విషయాన్ని వెల్లడించాడు మహేష్.
విషయంలోకి వెళితే… ఆ సమయంలో పరుచూరి బ్రదర్స్ వచ్చి కథ చెబుతున్నప్పుడు రాఘవేంద్రరావు గారి టేబుల్ పైన రబ్బర్ బ్యాండ్ ఒకటుంటే.. ఆ కథ వింటూ ఆ రబ్బర్ బ్యాండ్ తో మహేష్ ఆడుకుంటున్నాడట. నేరేషన్ పూర్తయ్యాక పరుచూరి బ్రదర్స్ వెళ్ళిపోయారట. అప్పుడు రాఘవేంద్రరావు గారు మహేష్ ను పిలిచి.. ‘కథ నచ్చినా, నచ్చకపోయినా నచ్చినట్లు బిహేవ్ చేయాలని, రబ్బర్ బ్యాండ్ తో ఆడుకుంటే దర్శకుల కాన్ఫిడెన్స్ పోతుందని, భవిష్యత్తులో ఇలా చెయ్యొద్దని’ మహేష్ కు క్లాస్ పీకారట. ఈ సంఘటన ఎప్పటికీ మరిచిపోలేనని మహేష్ చెప్పుకొచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకు నటన పట్ల అనుభవం ఉన్నప్పటికీ హీరో అనేసరికి చాలా ఇబ్బంది పడ్డాను.. ఆ టైములో రాఘవేంద్రరావు గారు తనకు అన్నీ నేర్పించారని గుర్తు చేసుకున్నాడు.