సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగు పెట్టిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా తొలి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నారు. అదే తరహాలో కృష్ణ మనవడు, మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ తొలి చిత్రం తోనే నందిని పట్టేయడం విశేషం. 2014 లో రిలీజ్ అయిన “వన్ నేనొక్కడినే” సినిమా లో గౌతమ్ బాలనటుడిగా నటించాడు. అందులో అతని నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ బాలనటుడిగా నందిని అందజేయడానికి సిద్ధమైంది. నిన్న ఈ విషయాన్నీ ప్రకటించింది. 2014 , 15 , 16 సంవత్సరాలకు నంది అవార్డుల జాబితాని వెల్లడించింది. వీటిలో 2015 లో ఉత్తమనటుడుగా మహేష్ బాబు నిలిచారు.
“శ్రీమంతుడు” చిత్రంలో మహేష్ నటనకు ఈ నంది వరించింది. తండ్రి కొడుకులకు ఒకేసారి నంది ప్రకటన వెలువడగానే మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మహేష్ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ నంది తో లెక్కవేస్తే మహేష్ ఇంటికి ఎనిమిది నందులు చేరినట్టే. రాజకుమారుడు, మురారి, నిజం, టక్కరి దొంగ, అర్జున్, అతడు, దూకుడు, శ్రీమంతుడు సినిమాలు మహేష్ కి నంది అవార్డులను అందించాయి.