మహేష్ బాబు(Mahesh Babu) ఇప్పుడు సూపర్ స్టార్. అయితే కెరీర్ ప్రారంభంలో నటుడిగా నిలబడడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ‘రాజకుమారుడు’ తో స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ సినిమాతో ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘యువరాజు’ ‘వంశీ’ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే వెంటనే ‘మురారి’ తో నటుడిగా తన ముద్ర వేసుకున్నాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ‘మురారి’ సెట్స్ లో ఉన్న టైంలోనే మహేష్ బాబు.. మరో సినిమాకి సైన్ చేశాడు. అప్పటి స్టార్ డైరెక్టర్ అయినటువంటి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా సెట్ అయ్యింది. ‘రోజా మూవీస్’ బ్యానర్ పై ఎం.అర్జున రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో ‘వేటగాడు’, చిరంజీవితో ‘జేబు దొంగ’, శ్రీకాంత్ తో ‘మా నాన్నకి పెళ్ళి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు.
అయితే ఈ ప్రాజెక్టు నుండి మహేష్ బాబుని తప్పించారు సూపర్ స్టార్ కృష్ణ. తర్వాత అది నాగార్జున చేతికి వెళ్ళింది. ‘బావ నచ్చాడు’ పేరుతో రూపొంది బయటకు వచ్చింది.ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా సిమ్రాన్, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు.2001 జూన్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో మహేష్ బాబు పెద్ద డిజాస్టర్ నుండి తప్పించుకున్నాడు అని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ‘యువరాజు’ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా నటించిన సిమ్రాన్… ‘బావ నచ్చాడు’ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది.