సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగా మంచి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే “షో” సినిమాతో నిర్మాతగా, నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొన్నారు మంజుల ఘట్టమనేని. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “పోకిరి” నిర్మాతల్లోనూ ఒకరు మంజుల. ఇలా తమ్ముడు మహేష్ కంటే ఒక అడుగు ఎప్పుడు ముందే ఉంటూ, ఒక్కోసారి తమ్ముడు సాధించే అఖండ విజయాల్లో భాగస్వామిగా వ్యవహరిస్తూ వస్తున్న అక్క మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా అవతారమెత్తారు. మరి తన వెన్నంటి ఉంటూ తన విజయాల్లో కీలకపాత్ర పోషించిన అక్క సినిమా రిలీజావుతుందంటే తమ్ముడి మనసు ఉరుకుంటుందా? అందుకే “మనసుకి నచ్చింది” ప్రమోషన్స్ లో మనస్ఫూర్తిగా పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు మహేష్ బాబు.
ఈ సందర్భంగా మహేష్ బాబు-మంజులతో ప్రత్యేకంగా ముచ్చటించింది “ఫిల్మీఫోకస్”. అక్కాతమ్ముళ్లు పంచుకొన్న తమ చిన్ననాటి స్మృతులు, తమ పర్సనల్ లైఫ్స్ గురించి చెప్పిన విశేషాలు మీకోసం..!!
ప్రశ్న: ఇలా మంజులగారితో కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తానని ఎప్పుడైనా అనుకొన్నారా ?
మహేష్ బాబు: నేనైతే ఖచ్చితంగా అనుకోలేదు. ఎందుకంటే తను నన్ను హీరోగా పెట్టి “నాని, పోకిరి” సినిమాలు తీసినప్పుడు కూడా ఇలా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. అలాంటిది తన సినిమా కోసం ఇలా కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తానని మాత్రం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ.. తప్పట్లేదు మళ్ళీ ఇంట్లో నాన్నగారికి కంప్లైంట్ ఇస్తుంది (నవ్వుతూ..).
మంజుల: రేయ్ నిన్నేమైనా బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టానా. నేను కూడా అస్సలు అనుకోలేదండీ వీడితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తానని.
ప్రశ్న: మీ మనసుకి నచ్చిన విషయం ఏంటి ?
మహేష్: నటన తర్వాత నా మనసుకు నచ్చిన విషయం నా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం, అందుకే సంవత్సరానికి కనీసం మూడుసార్లైనా ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ తీసుకొని ఫారిన్ టూర్స్ కి వెళ్లిపోతుంటాను.
మంజుల: నాకు నచ్చింది, అనిపించింది చేయడమే నా మనసుకి నచ్చిన విషయం. ప్రస్తుతానికి “మనసుకి నచ్చింది” సినిమాకి డైరెక్షన్ చేయడమే నా మనసుకి నచ్చిన విషయం.
ప్రశ్న: చిన్నప్పట్నుంచి ఇంతేనా? అంటే ఇలాగే ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొనేవారా ?
మహేష్: చూస్తున్నారుగా నేను చిన్నప్పట్నుంచి చాలా సైలెంట్. తనే ఎప్పుడూ నన్ను ఎడిపిస్తూ ఉండేది. నాకు తనలో నచ్చని విషయం ఏంటంటే.. మా ఫ్యామిలీ మొత్తంలో గట్టిగా అరిచేది మంజుల. మా ఇంటి పక్కన కనస్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ప్రశాంతత కోసమని నా స్టడీ రూమ్ లోకి వెళ్ళి నిశ్శబ్ధాన్ని ఎంజాయ్ చేసేవాడ్ని. సరిగ్గా అదే టైమ్ కి మంజుల ఇంటికి వచ్చేది. ఇంక ఎక్కడ ప్రశాంతత చెప్పండి, తన మాటలు స్టడీ రూమ్ లో రీసౌండ్ వచ్చేవి.
మంజుల: నేను మరీ అంత గట్టిగా ఏమీ అరిచేదాన్ని కాదు. కాకపోతే నా వాయిస్ కి బేస్ ఎక్కువ. అందుకే కొంచెం లౌడ్ గా వినిపించేది.
మహేష్: నేను చెప్పింది కూడా అదే, నీకు సౌండ్ కి బేస్ ఎక్కువ అని.
ప్రశ్న: ఎవరు ఎవర్ని ఎక్కువగా డామినేట్ చేసేవారు ?
మంజుల: డామినేషన్ విషయంలో మాత్రం మహేష్ ను ఎవ్వరూ బీట్ చేయలేరు. ఎందుకంటే.. చాలా సైలెంట్ గా ఉంటూ అందరి దగ్గరా మంచి మార్కులు కొట్టేసేవాడు. మా నాన్నగారికైతే “మహేష్ ది బెస్ట్” అన్నట్లు. అందుకే వీడంటే చిన్నప్పుడు కాస్త అసూయ ఉండేది.
మహేష్: నేను ఎప్పుడు ఎవర్నీ డామినేట్ చేయడానికి ప్రయత్నించలేదు. కాకపోతే మంజుల ఎప్పుడు అరుస్తూ ఉండేది, నేను సైలెంట్ గా ఉండేవాడ్ని. అందువల్ల అందరి దగ్గరా నాకు మంచి మార్కులు పడేవి.
ప్రశ్న: స్టార్ కిడ్స్ అవ్వడం వల్ల లాభం ఏమిటి? నష్టం ఏమిటి ?
మహేష్: లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికెళ్లినా కృష్ణగారి పిల్లలు అన్నట్లే ప్రత్యేకంగా చూసేవారు. ఒక్కోసారి ఆ ప్రత్యేకదనం బాగానే అనిపించినా, కొన్నిసార్లు మాత్రం చాలా చిరాగ్గా అనిపించేది. ముఖ్యంగా అందరు పిల్లల్లా లైఫ్ ఎంజాయ్ చేయడానికి కుదిరేది కాదు. నేను చిన్నప్పట్నుంచే నటించడం మొదలెట్టానేమో నాకు అసలు ప్రైవసీ ఉండేది కాదు.
మంజుల: నాకు మరీ మహేష్ కి ఉన్నంత ఇబ్బందులేమీ లేవు. అయితే.. అప్పుడప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే.. నాన్నగారు హాలీడేస్ కి తీసుకెళ్లినప్పుడు అందరూ మావంక ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు మాత్రం ఎంజాయ్ చేసేదాన్ని.
ప్రశ్న: మంజుల డైరెక్షన్ వైపుకు ఎందుకొచ్చింది ?
మహేష్: నాకు ఇప్పటికీ షాకింగ్ గా అనిపించే విషయం అదే. ఒకసారెప్పుడో హాలీడేస్ కి వెళ్లినప్పుడు, ఒక పక్కకి కూర్చుని రాసుకుంటుంటే.. “ఏం రాసుకొంటున్నావ్?” అని అడిగితే “సినిమా స్టోరీ” అని చెప్పింది. షాక్ అయ్యాను. అయితే.. నిజంగా సినిమా తీస్తుంది అని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు.
మంజుల: నాకు చిన్నప్పట్నుంచి ఏదైనా కొత్తగా చేయడం అలవాటు. నటిగా “షో, ఆరెంజ్” సినిమాలు చేశాను. నిర్మాతగా “నాని, పోకిరి, ఏమాయ చేసావే” సినిమాలు తీశాను. సో మిగిలింది డైరెక్షన్ మాత్రమే. అందుకే “మనసుకి నచ్చింది” కథ రాసుకొని దర్శకురాలిగా ప్రయత్నిద్దామనుకొన్నాను.
ప్రశ్న: డైరెక్షన్ చేయాలనుకొంటున్నానని ముందు ఎవరికి చెప్పారు ?
మంజుల: ముందు మహేష్ కే వాట్సప్ లో మెసేజ్ చేశాను. వాడికి మెసేజ్ చేసినప్పట్నుంచి అందులో “బ్లూ టిక్” ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చూశాను. ఆ తర్వాత నాన్నగారికి చెప్పాను. ఇద్దరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు.
మహేష్: వాట్సాప్ లో “బ్లూ టిక్” రాకుండా కూడా ఏదో ఆప్షన్ ఉందంట కదా, ఈసారి అది సెట్ చేసుకోవాలి, లేదంటే ప్రతిదీ నాకు మెసేజ్ చేసి చంపేస్తుంది (నవ్వుతూ..).
ప్రశ్న: పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీగా ఉందని చెప్పారు, ఆయనకి ఎప్పుడు వినిపిస్తారు ?
మహేష్: ఆవిడ దగ్గర చాలా కథలున్నాయి. నాకోసం కూడా కథ రెడీ చేశానని చెప్పింది. మా అబ్బాయి గౌతమ్ అడిగాడు కూడా “నాన్న మంజుల ఆంటీ డైరెక్షన్ లో ఎప్పుడు యాక్ట్ చేస్తావ్?” అని. నేను సైలెంట్ గా “అదే నా ఆఖరి సినిమా అవుతుంది” అని చెప్పేసా.
మంజుల: వీడ్ని నా సినిమా కోసం “వాయిస్ ఓవర్” చెప్పారా అని బ్రతిమిలాడితేనే తెగ ఫోజులిచ్చాడు. ఇక సినిమా అంటే కష్టమే. కానీ.. ఖచ్చితంగా మహేష్ తో ఒక సినిమా చేస్తాను.
మహేష్: వాయిస్ ఓవర్ అంటే ఏదో ఒకట్రెండు లైన్లు ఉంటాయి కదా అనుకొన్నాను. కానీ.. ఏకంగా నాలుగైదు పేజీలిచ్చింది. మళ్ళీ వేరియేషన్స్ కావాలంటూ తెగ షంటేసింది. అందుకే అలా అన్నాను.
మంజుల: అక్క కోసం ఆమాత్రం చేయలేవా ?
మహేష్: అందుకే కదా ఓపిగ్గా నా డైలాగ్స్ కొన్ని నేనే రాసుకొని మరీ వాయిస్ ఓవర్ చెప్పా.
ప్రశ్న: “మనసుకి నచ్చింది” ట్రైలర్ చూడగానే మీకేం అనిపించింది ?
మహేష్: నాకు విజువల్స్ బాగా నచ్చాయి. అలాగే.. మంజుల ఈ సినిమాలో ఒక సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది. ఆ పాట తెగ నచ్చేసింది.
మంజుల: వీడికి నచ్చుతుందో లేదో అని భయపడ్డాను. కానీ వీడు “బాగుంది” అని మెసేజ్ చేశాక చాలా సంతోషపడ్డాను.
ప్రశ్న: సందీప్ కిషన్ మీ ఫస్ట్ హీరో, అతడ్ని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది ?
మంజుల: సందీప్ చాలా సరదా కుర్రాడు. యాక్టింగ్ అంటే చాలా ఫ్యాషన్ ఉంది. నేను ఎన్ని టేక్స్ చెప్పినా చేసేవాడు. సెట్ లో అందరితోనూ చాలా హుందాగా వ్యవహరించేవాడు. ఒక్కోసారి ఆ అబ్బాయి అల్లరి నాకు మహేష్ ను గుర్తుకు తెచ్చేది.
మహేష్: ఎన్ని టేక్స్ తీసుకొనేదానివి ?
మంజుల: నీతో సినిమా తీసినప్పుడు లెక్కపెట్టుకో.
ప్రశ్న: ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎప్పుడు సినిమా చూస్తున్నారు ?
మంజుల: రేపు సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారు అనే టెన్షన్ క్లియర్ అవ్వగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చూస్తాం.
మహేష్: నేను మాత్రం అందరితో కలిసి చూడను, ఎందుకంటే అక్కడ బాగున్నా లేకపోయినా సచ్చినట్లు బాగుందనే చెప్పాలి. అందుకే మా ఇంట్లో నేను ఒక్కడ్నే కూర్చోని చూస్తా.
ప్రశ్న: ఇదే లాస్ట్ క్వశ్చన్.. సినిమా రిజల్ట్ మీద ఎలాంటి హోప్స్ ఉన్నాయి ?
మహేష్: నో కామెంట్
మంజుల: అదేంటి, నీకు హోప్స్ ఏమీ లేవా ?
మహేష్: సినిమా చూశాక చెప్తాలే.
మంజుల: నీ ఫీడ్ బ్యాక్ కోసం వెయిటింగ్.
ఫిల్మీ ఫోకస్ టీం: థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ టైమ్ & వర్డ్స్
మహేష్: థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అజ్ ఫీల్ ఫ్రీ టు టాక్
మంజుల: దిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఇంటర్వ్యూ, థ్యాంక్యూ 🙂