Indira Devi No More: సూపర్‌ కృష్ణ ఇంట కుటుంబంలో మరో విషాదం..మహేశ్‌బాబుకు మాతృవియోగం!

ప్రముఖ కథానాయకుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. దీంతో మహేష్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణ – ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియ దర్శిని ఉన్నారు.

ఇక కొద్దినెలల క్రితమే ఇందిరా దేవి పెద్ద కుమారుడు రమేశ్‌ బాబు అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణ జీవితం గురించి చూస్తే… విజయనిర్మల కన్నుమూయడంతో ఆయన బాగా కుంగిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా ఆయనకు దూరమయ్యారు. ఇందిరా దేవి మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మీడియాకు దూరంగా ఉండే ఇందిరాదేవి ఇటీవల.. ఒకటి రెండు సందర్భాల్లో మహేష్‌బాబుతో బయటకు వచ్చారు. శుభకార్యాల కోసం ఆమె బయటకు వచ్చినప్పుడు మహేష్‌తో ఆమె ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కుటుంబంతో ఆమె చేసుకున్న జన్మదిన వేడుకలు ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారనే వార్తలు వినిపించినా.. కుటుంబం నుండి ఎలాంటి సమాచారం లేదు. అయితే బుధవారం కన్నుమూసినట్లు వార్త రావడంతో అందరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

”కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఘట్టమనేని ఇందిరా దేవి కొద్దిసేపటి కిందట మృతి చెందారు. ఇందిరా దేవి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బుధవారం వేకువజామున లోకాన్ని విడిచారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచుతాం. అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నాం” అని కృష్ణ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus