ఓ వైపు సినిమాలు, మరో వైపు యాడ్ షూట్స్ లతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉన్నారు. పిల్లలను చూసుకోవడంలో, మహేష్ సేవా కార్యక్రమాలని పర్వవేక్షించడంలో నమ్రత తీరిక లేకుండా ఉన్నారు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోను, మల్టీప్లెక్స్ వ్యాపారంలోను అడుగుపెట్టారు. ఇలా క్షణం కూడా తీరిక లేని వీరిద్దరూ మరో మంచి పని మొదలెట్టారు. అదే ప్రతిభని ప్రోత్సహించడం. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా సాగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని మహేష్ దంపతులు భావిస్తున్నారు. అందుకే ఎవరైనా మంచి కంటెంట్‌తో ముందుకొస్తే వారికి ప్రోత్సాహం ఇచ్చి తమ బ్యానర్‌పై వెబ్ సిరీస్ నిర్మించడానికి సిద్దమయ్యారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ … నిజమయితే మాత్రం కొత్తవారికి మంచి ఫ్లాట్ ఫామ్ అవుతుంది. ప్రస్తుతం మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే మూవీ చేస్తున్నారు. రైతుల కష్టాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకరోల్ పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కెరీర్ లో నిలిపోయే విధంగా వంశీ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.