రెండు భాగాలుగా తీసే స్థాయి కంటెంట్ ఉన్న సినిమా భరత్ అనే నేను : మహేష్ బాబు

  • July 8, 2020 / 12:04 PM IST

“బేసిగ్గా నేను నాన్నగారి సినిమాలన్నీ చూశాను. అయితే.. కొరటాల శివగారు కథ చెబుతున్నప్పుడు కానీ.. సినిమా చేస్తున్నప్పుడు కానీ నాన్నగారు “ముఖ్యమంత్రి” అనే సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు అనే విషయం నాకు తట్టలేదు. అయితే.. రీసెంట్ గా ఆ విషయం తెలిసి సంతోషపడ్డాను. అలాగే.. ఇకపై ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే.. నాన్నగారి ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు. అందుకే ఇకపై కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలనుకొంటున్నాను” అంటూ తన మనసులోని అంతరంగాన్ని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. శుక్రవారం (ఏప్రిల్ 20) “భరత్ అనే నేను” విడుదల సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సర్కాస్టిక్ గా చెప్పిన సమాధానాలు, నవ్వుతూ చెప్పిన సంగతులు మీకోసం..!!

కొరటాల కథ చెప్పగానే భయపడ్డాను..
స్పైడర్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా కొరటాల శివ వచ్చి నాకు “భరత్ అనే నేను” కథ చెప్పారు. ఒకరోజు రెండున్నర గంటలపాటు ఫస్ట్ పార్ట్, ఇంకోరోజు మరో రెండున్నర గంటలపాటు సెకండ్ పార్ట్ ఎక్స్ ప్లైన్ చేశారు. కథ విన్న తర్వాత చాలా ఇన్స్ ఫైర్ అయ్యాను. ముందు ముఖ్యమంత్రి పాత్ర పోషించాలంటే భయపడ్డాను. ఆ తర్వాత కొరటాల కన్విన్స్ చేసేశారు. కాకపోతే.. కొరటాల అయిదు గంటలపాటు చెప్పిన కథను రెండున్నర గంటల సినిమాగా ప్రేక్షకులకు అందించగలనా అనే అనుమానం ఉండేది. అయితే.. ప్రోడక్ట్ చూసుకున్నాక ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి.

మా బావ పార్లమెంట్ వీడియోస్ కొన్ని చూశాను..
ఒక పొలిటీషియన్ గా నటించడానికి నేను ప్రత్యేకించి ఎలాంటి ట్రయినింగ్ తీసుకోలేదు. కాకపోతే.. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నడచుకోవాలి అనే విషయాల్లో పరిజ్ణానమ్ కోసం మా బావ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో మాట్లాడే వీడియోస్ చూశాను. అంతే తప్ప వేరే ఎవర్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం లాంటివి ఏమీ చేయలేదు.

పేజీలకు పేజీలు డైలాగులు చెప్పాను..
నా సినిమాల్లో ఇప్పటివరకూ మహా అయితే ఒక నాలుగైదు లైన్ల డైలాగులు చెప్పి ఉంటాను. కానీ.. మొట్టమొదటిసారిగా “భరత్ అనే నేను” కోసం పేజీలకు పేజీల డైలాగులు చెప్పాను. ఆ విషయంలో కొరటాల శివగార్నే మెచ్చుకోవాలి. ఆయనే నాకు క్యారెక్టర్ ను ఇంజెక్ట్ చేశారు. అలా క్యారెక్టర్ లో లీనం అయిపోయాను కాబట్టే ఆ పాత్రను అంత బాగా పోషించగలిగాను.

అందుకే హాలీడే ట్రిప్ కి వెళ్ళాను..
సినిమాలో భరత్ అనే పాత్రతో దాదాపు ఏడాదిన్నర ట్రావెల్ చేసేసరికి ఆ పాత్రలో ఎక్కువగా లీనం అయిపోయాను. ఆ క్యారెక్టర్ నుంచి బయటపడడం కోసం త్వరగా డబ్బింగ్ పూర్తి చేసి ఫ్యామిలీతో కలిసి ఒక వారం రోజులపాటు హాలీడే ట్రిప్ కి వెళ్లొచ్చాను. ఇప్పుడు నేను భరత్ ను కాదు మహేష్ ను.

ప్రేక్షకులను మంచి సినిమాతో ప్రభావితం చేయగలం..
“శ్రీమంతుడు” సినిమా చూసిన ప్రేక్షకులు కొందరు “గ్రామాలను దత్తత తీసుకోవడం” పట్ల ఆసక్తి చూపినట్లు, “భరత్ అనే నేను” విడుదలయ్యాక బాధ్యతగా ప్రవర్తించడం అనేది కూడా ప్రతి ఒక్కరికీ అలవాటవుతుంది. ఒక మంచి సినిమా ఎప్పుడైనా సరే ప్రేక్షకుల్ని ప్రభావితం చేయగలదు. ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు పాలిటిక్స్ మీద కూడా దృష్టి సారించడం మొదలెడతారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే.. రాజకీయాల మీద అవగాహన పెంచే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది.

నా ఏ సినిమాకీ ఇంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవ్వలేదు..
నా ప్రతి సినిమా విడుదల ముందు హిట్ అవుతుందా లేదా?, ప్రేక్షకులు మా చిత్రాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకొంటారు అని టెన్షన్ పడడం అనేది సర్వసాధారణం. ఈ సినిమా విషయంలోనూ అదే రకమైన ఉద్వేగానికి లోనవుతున్నాను. దాంతోపాటు అంతకుమించిన ఎగ్జైట్ మెంట్ కు లోనవుతున్నాను. నా కెరీర్ లో ఒక సినిమా విడుదలకు ముందు ఈస్థాయిలో ఎగ్జైట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి.

రెండు పార్ట్ లుగా తీసే స్టామినా ఉన్న కథ..
కొరటాల నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నాను ఈ సినిమాని రెండున్నర గంటల్లో చెప్పగలమా అని. అప్పటికీ 173 నిమిషాల సినిమాగా కుదించడానికి చాలా మంచి సన్నివేశాలు కత్తిరించాల్సి వచ్చింది. అసలు రెండు పార్ట్శ్ గా సినిమాని విడుదల చేసేంట కంటెంట్ ఉంది “భరత్ అనే నేను”లో.

రాజకీయాల్లో ఉన్న బాధ్యత తెలిసింది..
బేసిగ్గా నాకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే కనీసం రోజూ న్యూస్ పేపర్స్ కూడా చదవు, చదవడానికి పెద్దగా ఏమీ ఉండట్లేదు కూడా అనుకోండి (నవ్వుతూ). అయితే.. “భరత్ అనే నేను” సినిమాలో నటించాక రాజకీయాల్లో ఉన్న బాధ్యత తెలిసింది. పాలిటిక్స్ ఆర్ నాట్ ఏ జోక్ అని అర్ధమైంది, రాజకీయ నాయకులపై గౌరవం పెరిగింది.

మంజుల ఆ విషయాన్ని గుర్తు చేసింది..
నిజానికి మా సినిమా ఏప్రిల్ 27న విడుదలవ్వాలి. ఆ తర్వాత “నా పేరు సూర్య” నిర్మాతలతో మీటింగ్ అయ్యాక ఏప్రిల్ 20కి మార్చాం. ఒకవారం రోజుల తర్వాత మంజుల వచ్చి “ఆ రోజు అమ్మ పుట్టినరోజు” అని చెప్పింది. చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మ పుట్టినరోజునాడు విడుదలవ్వడం అంటే అమ్మ ఆశీర్వాదాలు ఉంటాయనిపించింది. దీనివల్ల సినిమా ప్రీపోన్ అవ్వడం విషయంలో చాలా సంతోషపడ్డాను.

నా 25వ సినిమా చుట్టూ ఉన్న సమస్యలన్నీ క్లియర్..
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నా 25వ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు కొన్ని లీగల్ & పర్సనల్ ఇష్యూస్ రైజ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయాయి. జూన్ నుంచి షూటింగ్ మొదలెడుతున్నాం. వంశీ నాకోసం రెండేళ్లు ఆగి మరీ తీస్తున్న సినిమా ఇది. చాలా బాగుంటుంది.

ట్రెడిషన్ మారుతుందేమో చూడాలి..
భరత్ బహిరంగ సభకు ఎన్టీయార్ ను చీఫ్ గెస్ట్ గా పిలవడం అనేది మా టీం అందరూ కలిసి తీసుకున్న డెసిషన్. అయితే.. మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్టీయార్ ఆ వేడుకకు విచ్చేయడం అన్నది భవిష్యత్ లో సరికొత్త ట్రెండ్ ను తీసుకొస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది.

ఎలాంటి పోలిటికల్ పంచ్ లు ఉండవు..
మాది రాజకీయాల నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా అయినప్పటికీ.. సినిమాలో ఏ పోలిటికల్ పార్టీకి సంబంధించి పంచ్ లు కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ ఉండవు. రాజకీయాల్లో ఇలాంటి లీడర్ ఉంటే బాగుండు, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి అనే ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.

అలా కంపేర్ చేస్తే చాలా సంతోషపడ్డాను..
“భరత్ అనే నేను” ఆడియో టీజర్ విడుదలయ్యాక చాలా మంది “ఏంటీ కృష్ణగారి గొంతులా ఉంది” అనుకున్నారు. కొందరైతే టెక్నాలజీని వాడి నాన్నగారి వాయిస్ నే కాస్త మోడరేట్ చేసి వాడాం అనుకున్నారు. ఆ కామెంట్స్ కి తెగ సంతోషపడిపోయాను. నా వాయిస్ ని నాన్నగారి గొంతుతో కంపేర్ చేయడం కంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి.

రంగస్థలం హిట్ అయినందుకు ఆనందంగా ఉంది..
పరిశ్రమకు హిట్స్ చాలా అవసరం. ఇన్ఫాక్ట్ “రంగస్థలం” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పట్ల నేను చాలా ఆనందపడ్డాను. ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందా సినిమా.

నేను-చరణ్ సినిమాలు తప్ప అన్నీ మాట్లాడుకుంటాం..
నేను, రామ్ చరణ్ రెగ్యులర్ గా కలుస్తామ్. సినిమాల గురించి తప్ప ప్రపంచంలోని అన్నీ విషయాల గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఎన్టీయార్ కూడా రెగ్యులర్ గా మీట్ అవుతాడు. అందుకే బహిరంగ సభలో అన్నాను హీరోలం మేము, మేము బాగానే ఉన్నాము. అభిమానులే బాగా ఉండాలి అని.

నాన్నగారి అభిమానులు ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు..
నేను ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేస్తున్నాను అని అందరూ మెచ్చుకుంటున్నారు బాగానే ఉంది కానీ అవి సరిగా ఆడడం లేదు. కానీ.. నాకు ఇకపై ప్రయోగాత్మక చిత్రాలు చేసేంత ఓపిక లేదండీ. ఇంకోసారి ప్రయోగం అంటే నాన్నగారి అభిమానులందరూ ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు. అందుకే ఇకపై కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాను.

ఆ బ్యాన్ తర్వాత మా బ్యాన్ సెట్ అయ్యింది..
నిజానికి “మురారి” షూటింగ్ టైమ్ లో దానయ్య గారు నా దగ్గరకి వచ్చి అప్పుడే కొత్తగా వచ్చిన 1000 రూపాయల నోట్లు చూపించారు భలే ఉన్నాయే అని నేను ఆసక్తిగా చూస్తుంటే.. మీరు ఒకే అంటే “ఈ కొత్త నోట్లతోనే మీకు అడ్వాన్స్ ఇస్తాను” అని చెప్పారు. అప్పట్నుంచి ఆయన నాతో సినిమా తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. ఇన్నాళ్ల తర్వాత “భరత్ అనే నేను”తో మా కాంబినేషన్ సెట్ అయ్యింది. అయితే.. ఇప్పుడు ఆ నోట్లు బ్యాన్ అవ్వడం గమనార్హం.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus