షాకిచ్చిన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ బిజినెస్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఇది మహేష్ బాబు కి 25 వ చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరుగలేదు. మహేష్ బాబు గత చిత్రాలు ‘స్పైడర్’ ‘భరత్ అనే నేను’ చిత్రాలకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ‘స్పైడర్’ చిత్రానికి తెలుగు, తమిళ భాషలు కలిపి 125 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా… ‘భరత్ అనే నేను’ చిత్రానికి 100 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ‘మహర్షి’ చిత్రానికి కేవలం 94.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనికి ముఖ్యకారణం ‘స్పైడర్’ చిత్రం డిజాస్టర్ కావడంతో 70 కోట్ల వరకూ నష్టం వచ్చింది, ఇక ‘భరత్ అనే నేను’ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి కూడా 7 కోట్ల వరకూ నష్టం వచ్చింది. దీంతో ‘మహర్షి’ చిత్రాన్ని భారీ రేట్లు పెట్టి కొనడానికి బయ్యర్లు భయపడుతున్నారు. ఏదో దిల్ రాజు, అశ్వినీ దత్ ల పుణ్యమా అని ఈ మాత్రం బిజినెస్ అయినా జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ రైట్స్ మాత్రం బాగా అమ్ముడయ్యాయి. డిజిటల్ రైట్స్,ఆడియో, డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి 47 కోట్లకు అమ్ముడవ్వడంతో సగం లాభాలు నిర్మాతలకి వచ్చేసినట్టే. ఓవరాల్ గా మహర్షి చిత్రానికి 141 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న మాట.

ఇక ‘మహర్షి’ చిత్రం వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 22 కోట్లు
సీడెడ్ – 12 కోట్లు
ఆంధ్ర – 38 కోట్లు


ఏపీ + తెలంగాణ – 72 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 10 కోట్లు
ఓవర్సీస్ – 12.50 కోట్లు


వరల్డ్ వైడ్ టోటల్ – 94.5 కోట్లు

నాన్ థియేట్రికల్ రైట్స్
(డిజిటల్ + ఆడియో +శాటిలైట్) – 47 కోట్లు
—————————————————
టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ – 141.50 కోట్లు
—————————————————-

‘మహర్షి’ చిత్రం హిట్ స్టేటస్ సంపాదించుకోవాలంటే 95 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఒక్క ‘వినయ విధేయ రామా’ చిత్రం తప్ప మరో పెద్ద సినిమా రాలేదు. కాబట్టి అందరి దృష్టి ‘మహర్షి’ పైనే ఉంది. ఏమాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు కలెక్షన్లు రావడం ఖాయం. అయితే ఈ చిత్రానికి నెగటివ్ సెంటిమెంట్లు కూడా భయపెడుతున్నాయి. మహేష్ బాబు 25 వ చిత్రం అంటే ఇంత తక్కువ థియేట్రికల్ బిజినెస్ జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అందులోనూ ఈ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది. మే నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్టవ్వలేదు. ఇక విడుదలైన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికే ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ను సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఒకవేళ డివైడ్ టాక్ వస్తే ఎవరివరకూ ఎందుకు మహేష్ అభిమానులే ‘మహర్షి’ చిత్రాన్ని డిజాస్టర్ చేసే వరకూ వదిలిపెట్టరని కూడా కొందరు కామెడీ చేస్తున్నారు. మరి ఫైనల్ ‘మహర్షి’ చిత్ర రెజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus