సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తమ ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. వాటిని బ్లాక్ చేసే సదుపాయం కూడా వారికి ఉంటుంది. అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తే ట్విట్టర్ వంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు అలా వేరే ఖాతాలకు దూరంగా ఉండే సెలబ్రిటీల పేర్లపై అకౌంట్ క్రియేట్ చేసి.. వాటితో ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.
అంతేకాదు అసభ్యకరమైన పోస్టులు వంటివి కూడా పెడుతుంటారు. మహేష్ బాబు కుమార్తె సితార పేరు పై కొందరు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి ఇలాంటి దారుణాలు చేస్తున్నారు.అలాంటి వారి నుండి మిగతా వారిని అప్రమత్తం చేసేందుకు సితార ఓ వార్నింగ్ లెటర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
దాని ద్వారా సితార స్పందిస్తూ.. “నా పేరు పై అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు ఉన్నాయి అని నాకు తెలిసింది. వాటితో కొందరు హద్దులు మీరు ప్రవర్తిస్తున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ ఇది గమనించాలి. నాకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాత్రమే ఉంది. అందులోనే నేను యాక్టివ్‌గా ఉంటాను. ఇది తప్ప నాకు వేరే సోషల్ మీడియా ఖాతా లేదు. ట్విట్టర్ వంటి వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ నాకు ఖాతా లేదు. ఇతర సోషల్ మీడియాల్లో నా పేరుతో ఉన్న ఖాతాలతో అప్రమత్తంగా ఉండండి.ఇదే నా మనవి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సితార పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.