సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళంలో మార్కెట్ పెంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ వీలుకుదరలేదు. ఇప్పుడు కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో స్ట్రయిట్ గా చైన్నై వాసులను పలకరించనున్నారు. ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ఎస్.జె. సూర్య, మహేష్ బాబులపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందులో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియదర్శి, తమిళ నటుడు ఆర్ జె బాలాజీ తదితరులు పాల్గొంటున్నారు.
వేసవికి విడుదలకానున్న ఈ మూవీ తమిళ వెర్షన్ కి మహేష్ బాబు సొంతంగా డబ్బింగ్ చెప్పనున్నారు. ప్రిన్స్ బాల్యం, విద్యాభ్యాసం మొత్తం చెన్నై లోనే జరిగింది. తమిళం చక్కగా మాట్లాడగలరు. అయన గత చిత్రాలు శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం డబ్ అయి తమిళనాడులో రిలీజ్ అయింది. కానీ వాటికి మహేష్ డబ్బింగ్ చెప్పలేదు. మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ స్ట్రయిట్ చిత్రం కావడంతో సూపర్ స్టార్ రంగంలోకి దిగారు. సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసుకోవడానికి రెడీగా ఉండాల్సిందే.