మహేష్ బాబు దర్శకుల హీరో అని, ఒక్కసారి కథను నమ్మితే దర్శకుడు చెప్పింది గుడ్డిగా నమ్ముతాడని, దర్శకులకు చాలా వేల్యూ ఇస్తాడని మనోడి మీద దర్శకులందరూ విపరీతమైన మర్యాద అభిమానం చూపిస్తుంటారు. కానీ.. మహేష్ బాబు మాత్రం తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులకు ఇచ్చిన వేల్యూ కమర్షియల్ సక్సెస్ తో సంబంధం లేకుండా నటుడిగా మహేష్ ను ప్రేక్షకులకు పరిచయం చేసినవారికి మాత్రం ఇవ్వడం లేదని అర్ధమవుతోంది. నిన్న జరిగిన “మహర్షి” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన 25 సినిమాల జర్నీలో తనను స్టార్, సూపర్ స్టార్, మాస్ హీరోను చేసిన దర్శకులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు చెప్పిన మహేష్ బాబు పూరీ జగన్నాధ్ పేరు అప్పటికి మర్చిపోయినప్పటికీ.. అనంతరం ట్విట్టర్ ద్వారా పూరీకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాడు.
కానీ.. తనకు “నిజం” చిత్రంతో తొలి నంది అవార్డ్ అందించిన దర్శకుడు తేజ గురించి కానీ, మహేష్ లో మరుగునపడిపోయిన నటుడ్ని “ఒన్ నేనొక్కడినే” చిత్రం ద్వారా ప్రేక్షకులకు మళ్ళీ పరిచయం చేసిన సుకుమార్ మరియు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాతో మహేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు ఓవర్సీస్ మార్కెట్ ను కూడా మరింతగా పెంచిన శ్రీకాంత్ అడ్డాల పేర్లను కానీ ప్రస్తావించలేదు. మురుగదాస్ అంటే భారీ స్థాయిలో “స్పైడర్”తో డిజాస్టర్ ఇచ్చాడు కాబట్టి మురుగను మరిచిపోయినా పర్లేదు కానీ.. తేజ, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకులకు కృతజ్ణతలు చెప్పకపోవడం మహేష్ అభిమానులకు కూడా నచ్చలేదు. ఈ విషయంలో మాత్రం మహేష్ తప్పు చేశాడనే చెప్పాలి.