మాజీ ఎం.ఎల్.ఎ, బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మల్లారెడ్డి మాటలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ హుషారెత్తించే విధంగా చేస్తుంటారు. భోళా మనిషి. మనసులో ఏదుంటే అది నాలుకతో బయటకు పంపించేయడం ఆయన నైజం. ‘పాలమ్మినా..’ అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో మొత్తం పాపులర్ అయిన మల్లారెడ్డి.. పండుగలు, పెళ్లిళ్లు, కాలేజీ ఈవెంట్లు వంటివి నిర్వహించినప్పుడు.. ఈయన చేసే సందడి మామూలుగా ఉండదు అనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి అనేక సినిమా ఈవెంట్లలో కూడా సందడి చేసి జనాలకు చేరువయ్యారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల మల్లారెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన సినిమాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ తో చేసే సినిమాలో విలన్ పాత్ర కోసం మల్లారెడ్డిని సంప్రదించారట. ఇందుకోసం ఏకంగా రూ.3 కోట్లు పారితోషికంగా ఇప్పిస్తానని క్రేజీ ఆఫర్ ఇచ్చారట హరీష్. కానీ మల్లారెడ్డి అందుకు ఒప్పుకోలేదు.’ విలన్ గా చేయడం తనకు ఇష్టం లేదని, ఇంటర్వెల్ వరకు హీరోని తిట్టడం, ఇంటర్వెల్ తర్వాత హీరోతో కొట్టించుకోవడం’ వంటి పాత్రలు చేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని మల్లారెడ్డి.. హరీష్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట.
దసరా సందర్భంగా తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు మల్లారెడ్డి. అందులో భాగంగా.. ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. మల్లారెడ్డి బాడీ లాంగ్వేజ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాల్లో విలన్ తో కామెడీ కూడా చేయిస్తారు. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం మల్లారెడ్డిని కన్సల్ట్ చేసి ఉండొచ్చు అని స్పష్టమవుతుంది.